దేశమంతా సంచలనం రేపుతున్న కోల్కతా డాక్టర్ కేసులో అప్ డేట్ ఇది. ఆర్జీకర్ మెడికల్ కాలేజీ మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ నివాసంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ED సోదాలు నిర్వహిస్తోంది. తన హయాంలో మెడికల్ కాలేజీలో ఆర్థిక అవకతవకలకు సంబంధించి ఈడీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు.
అంతకుముందు ట్రైనీ డాక్టర్ హత్యాచారం కేసులో 15 రోజులపాటు ఆయనను విచారించింది. మెడికల్ కాలేజీ మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్ సన్నిహితులైన ముగ్గురి నివాసాలపై కూడా అధికారులు దాడులు నిర్వహించారు. సందీప్ ఘోష్ ప్రస్తుతం సీబీఐ కస్టడీలో ఉన్నాడు. ఈ నెల 2న ఆయనను సీబీఐ అరెస్టు చేసింది. కోర్టు ఆయనకు ఎనిమిది రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది.
ఆగస్టు 9న కోల్‌కతాలోని ఆర్ జీ కర్ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో ట్రైనీ డాక్టర్‌పై హత్యాచారం జరిగింది. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ హత్యాచారం ఘటన జరిగిన కొన్ని గంటలకే కాలేజీ ప్రిన్సిపల్ పదవికి సందీప్ ఘోష్ రాజీనామా చేశారు. అయితే కొన్ని గంటల వ్యవధిలోనే ఆయనకు సీఎం మమతా బెనర్జీ ప్రభుత్వం మరో కీలక పదవిలో నియమించింది.