సీఏఏ పౌరసత్వ సర్టిఫికెట్లు తొలిసారి జారీ అయ్యాయి. కేంద్ర ప్రభుత్వం పౌరసత్వ సవరణ చట్టం 2019 (CAA) అమలులోకి వచ్చిన తర్వాత తొలిసారిగా 14 మందికి భారత పౌరసత్వం మంజూరు అయింది. కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ కుమార్ భల్లా వారికి సీఏఏ కింద మంజూరైన పౌరసత్వ సర్టిఫికెట్లను అందజేశారు. ఆన్‌లైన్ దరఖాస్తులను ప్రాసెస్ చేసిన తర్వాత సర్టిఫికేట్లను ఆయన అందించారు.
దేశంలో సీఏఏ అమలుపై ఈ ఏడాది మార్చిలో కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే. 2019 డిసెంబర్‌లో ప్రతిపక్షాల తీవ్ర నిరసనల మధ్య సీఏఏ చట్టం పార్లమెంట్ ఉభయసభల్లో ఆమోదం పొందింది. ఆ తర్వాత రాష్ట్రపతి ఆమోదం కూడా దీనికి లభించింది. సీఏఏ చట్టం ప్రకారం.. పాకిస్థాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్థాన్ దేశాల నుంచి వలస వచ్చిన ముస్లిమేతర శరణార్థుల వద్ద తగిన పత్రాలు లేకపోయినా వారికి సత్వరమే భారత పౌరసత్వాన్ని ఇచ్చేలా కేంద్రం నిబంధనలను రూపొందించింది.
దేశంలో 11 ఏళ్లపాటు నివసించడం గానీ.. పనిచేసి ఉండాలనే నిబంధనలను సవరించింది. పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్థాన్ కు చెందిన ముస్లిమేతర శరణార్థులు పౌరసత్వం పొందాలంటే ఆరేళ్లపాటు దేశంలో నివసించడం లేదా పనిచేసి ఉండాలి. 2014 డిసెంబర్ 31 కంటే ముందు ఈ మూడు దేశాల నుంచి మనదేశానికి వచ్చిన హిందువులు, క్రిస్టియన్లు, సిక్కులు, జైనులు, బౌద్ధులు, పార్సీలకు సీఏఏ ద్వారా పౌరసత్వం ఇవ్వనున్నారు.