Shaktikanta Das: ప్రధాని మోదీ ప్రిన్సిపల్ సెక్రటరీ-2 గా ఆర్బీఐ మాజీ గవర్నర్‌

శక్తికాంత దాస్‌కు కీలక పదవి;

Update: 2025-02-23 01:00 GMT

 ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి రెండో ప్రిన్సిపల్ సెక్రటరీగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాజీ గవర్నర్ శక్తికాంత దాస్‌కు అవకాశం కల్పించారు. ఈ నేపథ్యంలోనే ప్రధాని వద్ద కీలక పదవి లభించింది. శక్తికాంత దాస్‌ నియామకానికి సంబంధించి.. కేంద్ర కేబినెట్ నియామకాల కమిటీ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే శక్తికాంత దాస్ పదవీ బాధ్యతలు స్వీకరించినప్పటినుంచి ఆయన నియామకం అమల్లోకి వస్తుందని ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది. ఇక ప్రధాని ప్రిన్సిపల్ సెక్రటరీగా.. శక్తికాంత దాస్ పదవీ కాలం ప్రధానమంత్రి పదవీ కాలంతో సమానంగా ఉంటుంది. లేదా కేంద్ర కేబినెట్ నియామకాల కమిటీ ఇచ్చే తదుపరి ఆదేశాలు వరకు కొనసాగుతారని ఆ ఉత్తర్వుల్లో వెల్లడించింది.

ఫిబ్రవరి 26, 1957న భువనేశ్వర్‌లో జన్మించిన దాస్, ఢిల్లీలోని సెయింట్ స్టీఫెన్స్ కళాశాల నుండి చరిత్రలో బ్యాచిలర్ మరియు మాస్టర్స్ డిగ్రీని పూర్తి చేశారు. 1980 బ్యాచ్ తమిళనాడు కేడర్‌కి చెందిన ఐఎఎస్ అధికారి అయిన శక్తికాంత దాస్ తమిళనాడు, కేంద్ర ప్రభుత్వాల్లో వివిధ హోదాల్లో పనిచేశారు.

ఆర్థిక రంగ ఒత్తిళ్లతో కూడిన సమయంలో 2018లో ఆర్బీఐకి 25వ గవర్నర్‌గా బాధ్యతలు తీసుకున్నారు. కోవిడ్-19, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, అధిక ద్రవ్యోల్బణం వంటి కఠిన పరిస్థితుల్లో స్థిరత్వాన్ని తీసుకురావడానికి, దేశ ఆర్థిక వ్యవస్థని నడిపించడంలో కీలకంగా వ్యవహరించారు. గత ఏడాది డిసెంబర్‌లో పదవీ విరమణ చేశారు. 2021లో, ప్రజా పరిపాలనకు ఆయన చేసిన కృషికి గాను ఉత్కళ్ విశ్వవిద్యాలయం దాస్‌కు డాక్టర్ ఆఫ్ లెటర్స్ (డి.లిట్.) బిరుదును ప్రదానం చేసింది.

Tags:    

Similar News