GAGANYAN: గగన్‌యాన్‌కు సిద్ధమవుతున్న భారత్
అక్టోబర్ 21న క్రూ ఎస్కేప్ సిస్టమ్ పరీక్ష... సిద్ధమవుతున్న ఇస్రో;
అంతరిక్ష ప్రయోగాల్లో కొంతకాలంగా భారత్ దూసుకెళ్తుంది. ఎప్పుడూ లేని విధంగా విజయపరంపరను కొనసాగిస్తోంది. చంద్రయాన్-3 ప్రయోగం విజయవంతం ఆదిత్య ఎల్-1 ప్రయోగాలతో దూకుడు మీదున్న ఇస్రో ఇప్పుడు గగన్‌యాన్ ప్రయోగానికి సిద్ధమైంది. ఇప్పటివరకు అమెరికా, రష్యా, చైనాకు చెందిన వ్యోమగాములు మాత్రమే అంతరిక్షంలోకి వెళ్లారు. భారతీయులు కూడా వెళ్లారు కానీ భారత్ స్వయంగా ప్రయోగించిన మిషన్ల ద్వారా ఎవరూ వెళ్లలేదు. అందుకే భారత్ సొంతంగా వ్యోమగాములను పంపేందుకు గగన్‌యాన్ మిషన్ చేపట్టింది. అక్టోబర్ 21న శ్రీహరికోటలోని షార్ కేంద్రం నుంచి ఇస్రో ఈ ప్రయోగం చేపట్టనుంది. వ్యోమగాములను అంతరిక్షంలోకి తీసుకెళ్లి తిరిగి సురక్షితంగా తీసుకురావడమే దీని లక్ష్యం.
2006లో మెుదలైన గగన్‌యాన్ ప్రాజెక్ట్ అనేక కారణాలతో ఇప్పటివరకు వాయిదాపడుతూ వచ్చింది. ఎట్టకేలకు ఇప్పుడు కీలక దశకు చేరుకుంది. అందులో భాగంగా క్రూ ఎస్కేప్ సిస్టమ్‌ను అక్టోబర్ 21న పరీక్షించనున్నారు. అంతరిక్ష యాత్ర చేపట్టే వ్యోమగాములను అత్యవసర పరిస్థితుల్లో రక్షించేందుకు ఏర్పాటు చేసిన వ్యవస్థ ఇది. ఇందులో ఉన్న వ్యోమగాములు సురక్షితంగా అంతరిక్ష యాత్ర చేపట్టాలంటే ముందు ఈ పరీక్ష విజయవంతం కావాలి. అందుకే భారత్ గగన్‌యాన్ ప్రాజెక్ట్‌లో కీలకమైన క్రూ ఎస్కేప్ ప్రాజెక్ట్‌ను పరీక్షించనుంది. దీనిలో భాగంగా క్రూ ఎస్కేప్ సిస్టమ్‌తోపాటు మాడ్యూల్‌ను 17కిలోమీటర్ల ఎత్తులోకి తీసుకెళ్తారు.
అక్కడ మాడ్యూల్ ఆటోమేటిక్ పద్ధతి ద్వారా ఎస్కేప్ సిస్టమ్ నుంచి వేరవుతుంది. అలా వేరైన క్రూ సురక్షితంగా పారాచూట్‌ల సాయంతో బంగాళాఖాతంలో నేరుగా పడేలా చూస్తారు. దీనిని ఇండియన్ నేవీ బృందం కూడా ఎళ్లవేళలా పర్యవేక్షించనుంది. ఇప్పటికే పారాచూట్‌లను ప్రయోగించగా కీలకమైన క్రూ మాడ్యూల్ సిస్టమ్‌కు పరీక్షకు రంగం సిద్ధమైంది. ఈ తొలి దశ ప్రయోగం విజయవంతమైతేనే 2024లో నిర్వహించాలని అనుకుంటున్న గగన్‌యాన్‌కు మార్గం సుగమం అవుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
భవిష్యత్‌లో చేపట్టే గగన్‌యాన్ ప్రయోగం కోసం ముందుగా వ్యోమగాములను ఎంపిక చేశారు. ఇందులో భాగంగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌కు చెందిన 60మంది పైలెట్లకు అనేక రకాల పరీక్షలు నిర్వహించి వడపోత తర్వాత చివరకు 2019లో నలుగురిని ఎంపిక చేశారు. అయితే, ఈ దశలో ఒక సందేహం రావొచ్చు. పైలెట్లే ఎందుకు అంతరిక్షంలోకి అని. అంతరిక్ష యాత్ర అనేది చాలా క్లిష్టమైన సవాల్. అంతరిక్ష నౌకలను నడపడం, పరిశోధనలు చేయడం, అత్యవసర పరిస్థితులలో నిర్ణయాలు తీసుకోవడం లాంటివి ఉంటాయి. ఈ సవాళ్లను అధిగమించడానికి పైలెట్లు ఎప్పుడూ సిద్ధంగా ఉండటంతో పాటు వీరు వివిధ రకాల ట్రైనింగ్‌లను పూర్తి చేసి ఉండటం కలిసొచ్చే అంశం. అయితే ఈ ప్రయోగం కోసం ఎంపిక చేసిన పైలట్లకు రష్యాలోని యూరి గగరిన్ కాస్మోనాట్ రీసెర్చ్ ట్రైనింగ్ సెంటర్‌లో శిక్షణ ఇచ్చారు. ప్రస్తుతం బెంగళూరులో కూడా వీరికి వివిధ రకాల శిక్షణలను అందిస్తున్నారు. ఇందులోనే వీరికి క్రూ మాడ్యూల్ ఆపరేటింగ్ కూడా ఉంటుంది.