RFID Safety : స్కూల్ బస్సుల్లో GPS, RFID టెక్నాలజీ.. అమెరికా, సింగపూర్ తరహాలో అమలు చేయనున్న ప్రభుత్వం!

Update: 2025-11-06 06:15 GMT

 RFID Safety : పాశ్చాత్య దేశాలలో ముఖ్యంగా అమెరికా, సింగపూర్, చైనా వంటి దేశాలలో ఉన్న అడ్వాన్సుడ్ టెక్నాలజీ ఉపయోగించి, భారతదేశంలోని అన్ని పాఠశాలల్లో విద్యార్థుల భద్రతను పెంపొందించడానికి ప్రభుత్వం ఒక కీలకమైన ప్రణాళికను రూపొందిస్తోంది. దీనిలో భాగంగా, రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ (RFID) ఆధారిత ట్రాకింగ్ సిస్టమ్ ను దేశవ్యాప్తంగా అమలు చేయాలని యోచిస్తోంది. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS) ఈ సిస్టమ్‎ను అభివృద్ధి చేస్తోంది. ఈ నూతన విధానం వల్ల పిల్లల కదలికలను రియల్ టైమ్‌లో తల్లిదండ్రులు, పాఠశాలలు పర్యవేక్షించగలుగుతారు. అయితే, ఈ టెక్నాలజీ వల్ల భద్రత పెరిగినా, డేటా దుర్వినియోగం అయ్యే ప్రమాదం గురించి నిపుణులు హెచ్చరిస్తున్నారు.

భారతదేశంలోని అన్ని పాఠశాలల్లో పిల్లల భద్రతను పెంచడానికి ప్రభుత్వం రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ ఆధారిత ట్రాకింగ్ వ్యవస్థను అమలు చేయాలని యోచిస్తోంది. అమెరికా, సింగపూర్, చైనా వంటి దేశాల్లో ఇప్పటికే ఉన్న ట్రాకింగ్ వ్యవస్థల మాదిరిగానే ఈ ప్రణాళికను అమలు చేయాలని చూస్తున్నారు. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ ప్రస్తుతం ఈ ట్రాకింగ్ సిస్టమ్ నమూనాను అభివృద్ధి చేస్తోంది. పాఠశాల బస్సుల్లో పిల్లల భద్రతను ఎలా నిర్ధారించాలనే దానిపై బీఐఎస్ ఒక పరిశోధన ప్రాజెక్ట్‌ను కూడా చేపట్టింది. ఈ ప్రాజెక్ట్‌లో RFID, జీపీఎస్ టెక్నాలజీలను ఉపయోగించి స్కూల్ బస్సులను ట్రాక్ చేసే విధానాన్ని అధ్యయనం చేయనున్నారు.

ప్రతి బిడ్డకు ఒక RFID ట్యాగ్‌ను అందించడం ద్వారా ఈ వ్యవస్థ పనిచేస్తుంది. స్కూల్ బస్సుల్లో RFID రీడర్‌లు, GPS, GSM కమ్యూనికేషన్ మాడ్యూల్స్, IP ఆధారిత కెమెరాలను అమర్చడం జరుగుతుంది. బిడ్డ బస్సు ఎక్కినప్పుడు లేదా దిగినప్పుడు, RFID ట్యాగ్ ద్వారా అది రికార్డ్ అవుతుంది. ఈ సమాచారాన్ని రియల్ టైమ్‌లో రికార్డ్ చేస్తారు. తల్లిదండ్రులు తమ పిల్లల కదలికలను ఎప్పటికప్పుడు మొబైల్ ద్వారా చూడవచ్చు. అలాగే, పాఠశాల యాజమాన్యం కూడా అన్ని బస్సులలోని విద్యార్థుల కదలికలను రియల్ టైమ్‌లో పర్యవేక్షించవచ్చు. ప్రస్తుతం బెంగళూరు, ఢిల్లీ, ముంబై వంటి కొన్ని ప్రధాన నగరాల్లోని ప్రతిష్టాత్మక పాఠశాలల్లో మాత్రమే జీపీఎస్ ఆధారిత ట్రాకింగ్ వ్యవస్థలు వాడుకలో ఉన్నాయి.

RFID ట్రాకింగ్ వల్ల పిల్లల భద్రత పెరుగుతున్నప్పటికీ, దీని దుర్వినియోగం అయ్యే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. సుప్రీంకోర్టు న్యాయవాది, సైబర్ సెక్యూరిటీ నిపుణుడు పవన్ దుగ్గల్ అభిప్రాయం ప్రకారం.. ఈ RFID ట్రాకింగ్ వ్యవస్థ ఆన్‌లైన్‌లో ఉన్నందున, పిల్లల స్థానం, ఇతర డేటా తప్పుడు వ్యక్తుల చేతికి చిక్కితే దుర్వినియోగం అయ్యే ప్రమాదం ఉంది. ఈ విషయంలో ప్రభుత్వం తగిన భద్రతా చర్యలు తీసుకోవాలి.

Tags:    

Similar News