ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా భారత్ ఇప్పటికే రికార్డులు కెక్కింది. ఇప్పుడు 2060వ సంవత్సరానికల్లా భారత దేశ జనాభా 170 కోట్లకు చేరుతుందని యూఎన్ఓ నివేదిక వెల్లడించింది. ఆ తర్వాత 12శాతం తగ్గుదల రేటుతో క్రమంగా దిగొస్తుందని తెలిపింది. 2100 వరకు ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశంగా భారత్ కొనసాగుతుందని పేర్కొంది. ఈ మేరకు 'వరల్డ్ పాపులేషన్ ప్రాస్పెక్ట్స్ 2024' పేరిట ఓ నివేదిక విడుదల చేసింది.
2100 నాటికి చైనా జనాభా 78.6 కోట్లు తగ్గి 63కోట్లకు పరిమితం కానుందని తెలిపింది. 2024లో భారత్ జనాభా 145 కోట్లని, 2054 నాటికి అది 169 కోట్లకు చేరుతుందని తెలిపింది. ఆ తర్వాత క్రమంగా 150 కోట్లకు తగ్గుతుందని తెలిపింది. ఇక 2054 నాటికి 100 దేశాల్లో పనిచేసే వయసున్న వారి జనాభా సంఖ్య భారీగా పెరుగుతుందని తెలిపింది. ఇలాంటి దేశాల్లో అభివృద్ధికి అపార అవకాశాలు ఉంటాయని.. వాటిని అందిపుచ్చుకోవాలంటే విద్య, వైద్యం, మౌలిక సదుపాయాలపై పెట్టుబడులు పెట్టాలని తెలిపింది.
ఉద్యోగాలను సృష్టించేందుకు సంస్కరణలను అమలు చేయాలని, ప్రభుత్వాల సామర్థ్యాన్ని మెరుగుపర్చుకోవాలని సూచించింది. 2100 నాటికి చైనా జనాభా కంటే భారత జనాభా రెండున్నర రెట్లు ఎక్కువ ఉంటుందని తెలిపింది. చైనాలో సగటున ఒక్కో మహిళ తమ జీవితకాలంలో ఒకరికి మాత్రమే జన్మనిస్తున్నట్లు తెలిపింది. ప్రస్తుతం 820 కోట్లుగా ఉన్న ప్రపంచ జనాభా 2080 నాటికి 1030 కోట్లకు చేరుతుందని నివేదిక తెలిపింది. 2070 నాటికి ప్రపంచ జనాభాలో 65 ఏళ్లు, ఆ పైబడిన వారి సంఖ్య 220 కోట్లకు చేరుతుందని.. ఇది 18 ఏళ్లలోపు వారి సంఖ్య కంటే అధికమని నివేదిక సూచించింది. వరల్డ్ వైడ్ గా మనుషుల జీవిత కాలం కరోనా సమయంలో 70.9 ఏళ్లకు తగ్గగా.. 2024 నాటికి అది 73.3 ఏళ్లకు పెరిగిందని తెలిపింది.