తీవ్ర ఉష్ణోగ్రతలకు తాళలేక ఉత్తరాది ప్రజలు పిట్టల్లా రాలిపోతున్నారు. బిహార్‌లోని ఔరంగాబాద్‌లో బుధవారం 48.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవగా, వేడి సంబంధ సమస్యలతో జిల్లా ఆస్పత్రిలో 2 గంటల వ్యవధిలో 16 మంది మరణించారు. గత 24 గంటల వ్యవధిలో వడగాలులకు మరో 19 మంది చనిపోయారు. ఎండలకు ఢిల్లీలో ఓ వ్యక్తికి అసాధారణ స్థాయిలో 108 డిగ్రీల సెల్సియన్ జ్వరం వచ్చింది. కిడ్నీలు, కాలేయం విఫలమై అతను చనిపోయారు.
మరోవైపు ఏపీలో 145 మండలాల్లో నేడు వడగాలులు వీచే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. అల్లూరి జిల్లా కూనవరం మండలంలో తీవ్ర వడగాలులు వీస్తాయని తెలిపింది. నిన్న ప్రకాశం జిల్లా పామూరులో 44.8°C, ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం, పల్నాడు జిల్లా నరసరావుపేటలో 44.7°C ఉష్ణోగ్రత నమోదైనట్లు పేర్కొంది.
మంచిర్యాల జిల్లా భీమారంలో ఈరోజు 47.2°C ఉష్ణోగ్రత నమోదైందని వాతావరణశాఖ తెలిపింది. ఈ ఏడాది అత్యధిక ఉష్ణోగ్రత. భద్రాద్రి కొత్తగూడెం(47.1°C), పెద్దపల్లి(46.7°C), కుమురంభీమ్(46.6°C), ఖమ్మం(46.5°C) అత్యధిక ఉష్ణోగ్రతలను చూశాయి. హైదరాబాద్‌లో 43.0°C ఉష్ణోగ్రత నమోదైంది. మరో 3 రోజులు ఇలాగే తీవ్ర ఉష్ణోగ్రతలు నమోదై ఆ తర్వాత వేడి తగ్గే అవకాశం ఉందని వివరించింది.