Maharashtra : డిగ్రీ పూర్తయితే రూ. 10 వేలు.. షిండే సర్కార్ బంపరాఫర్

Update: 2024-07-18 07:05 GMT

మహారాష్ట్రలోని ఏక్ నాథ్ షిండే ప్రభుత్వం కొత్త పథకానికి శ్రీకారం చుట్టింది. నిరుద్యోగ యువత కోసం ఓ ఇంటర్న్ షిప్ ప్రోగ్రామ్ ను తీసుకొచ్చింది. ముఖ్య మంత్రి యువ కార్యప్రశిక్షణ యోజన పేరుతో నిరుద్యోగ యువతకు వారి విద్యార్హతల్నిబట్టి నెలనెలా బ్యాంకు ఖాతాల్లో స్టయిఫండ్ జమ చేయనున్నారు.

ఇందుకోసం రూ. 5500 కోట్లను కేటాయించనున్నారు. ఈ ఏడాది చివరలో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో, షిండే సర్కార్ వ్యూహాత్మకంగా ఈ పథకాన్ని తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. 18-35 ఏళ్ల మధ్య వయసు గల మహారాష్ట్ర నివాసితులు ఈ పథకానికి అర్హులు. కనీసం 12వ తరగతి పాసై పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తిచేసిన వారు ఈ పథకం కింద లబ్దిపొందొచ్చు. ప్రాక్టికల్ ట్రైనింగ్ పొందడం తోపాటు పరిశ్రమ అవసరాలకు యువతను సిద్ధం చేయడం ఈ పథకం ముఖ్య ఉద్దేశమని మహా ప్రభుత్వం ప్రకటించింది.

ఆరు నెలల ఇంటర్న్ షిప్ కాలంలో అర్హులైన వారికి నేరుగా వారిబ్యాంకు ఖాతాలో డబ్బులు జమ అవుతాయి. 12వ తరగతి పాసైన వారికి రూ.6 వేలు, ఐటీఐ/డిప్లొమా వారికి రూ.8వేలు, డిగ్రీ/పీ జీ పూర్తి చేసిన వారికి రూ.10వేలు చొప్పున స్టయిఫండ్ చెల్లించనున్నారు. ఇప్పటికే మహిళలకు లాడ్లీ బెహన్ స్కీమ్ ను ప్రారంభించామని, ఈ నేపథ్యంలో పురుషుల కోసం పథకాలేవీ లేవా అని చాలా మంది అడుగుతున్నారన్న సీఎం, ఈ క్రమంలోనే యువత కోసం ఈ పథకం తీసుకొచ్చామని తెలిపారు.

Tags:    

Similar News