Richest Ganpati: వినాయకుడి మండపానికి రూ.474 కోట్లకు ఇన్సూరెన్స్.. కారణం ఎంతంటే ?
స్వామివారికి 66 కిలోల బంగారం, 336 కిలోల వెండి ఆభరణాలు;
దేశంలోనే అత్యంత సంపన్న గణేష్ మండలిగా పేరుగాంచిన ముంబై కింగ్స్ సర్కిల్‌లోని జీఎస్‌బీ సేవా మండల్, ఈ ఏడాది గణేష్ చతుర్థి ఉత్సవాల కోసం భారీ బీమా చేయించింది. ఈ సంవత్సరం ఏకంగా రూ. 474.46 కోట్ల విలువైన బీమా పాలసీని తీసుకోవడం విశేషం. గత ఏడాది ఈ మొత్తం రూ. 400 కోట్లుగా ఉండగా, ఈసారి గణనీయంగా పెరిగింది.
బంగారం ధరలే కారణం
ఈ బీమా కవరేజీ ఇంత పెద్ద మొత్తంలో పెరగడానికి ప్రధాన కారణం బంగారం, వెండి ఆభరణాల విలువ పెరగడమేనని నిర్వాహకులు తెలిపారు. ప్రస్తుతం స్వామివారికి అలంకరించే 66 కిలోల బంగారం, 336 కిలోల వెండి ఆభరణాల విలువ అధికంగా ఉంది. గత సంవత్సరం 10 గ్రాముల బంగారం ధర రూ. 77,000 ఉండగా, ప్రస్తుతం అది రూ. 1,02,000కి చేరింది. ఈ కారణంగానే కేవలం ఆభరణాల రక్షణ కోసం తీసుకున్న 'ఆల్-రిస్క్' పాలసీ విలువ గత ఏడాది రూ. 43 కోట్ల నుంచి ఈసారి రూ. 67 కోట్లకు పెరిగింది.
విభాగాల వారీగా బీమా వివరాలు
ఈ మొత్తం రూ. 474.46 కోట్ల పాలసీలో అధికభాగం వాలంటీర్లు, పూజారులు, వంట సిబ్బంది, భద్రతా సిబ్బంది వంటి వారి వ్యక్తిగత ప్రమాద బీమా కోసమే కేటాయించారు. దీని విలువ రూ. 375 కోట్లుగా ఉంది. మండపానికి వచ్చే భక్తులు, పండల్, ఇతర నిర్మాణాల రక్షణ కోసం ప్రజా బాధ్యత (పబ్లిక్ లయబిలిటీ) కింద రూ. 30 కోట్ల కవరేజీని తీసుకున్నారు.
అగ్నిప్రమాదాలు, భూకంపాలు వంటి ప్రకృతి వైపరీత్యాల నుంచి రక్షణ కోసం తీసుకున్న బీమా విలువలో మార్పు లేదు. ఇది గత సంవత్సరం మాదిరిగానే రూ. 2 కోట్లుగా ఉంది. అదనంగా, ఉత్సవాలు జరిగే ప్రాంగణం కోసం మరో రూ. 43 లక్షల పాలసీని కూడా తీసుకున్నట్లు న్యూ ఇండియా అస్యూరెన్స్ సంస్థ వెల్లడించింది.