Floods: భారీ వర్షాలకు నేపాల్‌లోని పలు జిల్లాలు అతలాకుతలం.. 22 మందికి పైగా మృతి..
రహదారులు బ్లాక్ కావడంతో పాటు కొట్టుకుపోయిన వంతెనలు
గత 36 గంటలుగా కురుస్తున్న భారీ వర్షాలకు నేపాల్‌లోని పలు జిల్లాలు అతలాకుతలమయ్యాయి. కొండచరియలు విరిగిపడటం, ఆకస్మిక వరదలు, రహదారులు బ్లాక్ కావడంతో పాటు వంతెనలు కొట్టుకు పోయాయని అధికారులు తెలిపారు. ఈ ఘటనలో 22మంది మరణించారన్నారు. భారత్‌కు తూర్పు సరిహద్దుగా ఉన్న ఇలాం జిల్లాలో వేర్వేరు కొండచరియలు విరిగిపడి 18 మంది మరణించారని పోలీస్ ప్రతినిధి బినోద్ తెలిపారు.
ఖాట్మండులో 226 ఇళ్లు నీట మునిగిపోయాయని, దాదాపు 3,000 మంది భద్రతా సిబ్బందితో కూడిన రెస్క్యూ టీమ్‌ను ప్రభావిత ప్రాంతాలకు తరలించామని నేపాల్ పోలీసులు తెలిపారు. ఇప్పటివరకు 1,000 మందికి పైగా ప్రజలను రక్షించారు. దక్షిణ నేపాల్‌లో పిడుగులు పడి ముగ్గురు మరణించగా, తూర్పు నేపాల్‌లోని ఉదయ్‌పూర్ జిల్లాలో వరదల కారణంగా ఒకరు మరణించారని అన్నారు. శుక్రవారం నుంచి భారీ వర్షాలు కురుస్తుండడంతో.. విపత్తు నిర్వహణ అధికారులు ఆకస్మిక వరదలు సంభవించే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేశారు.
నేపాల్ సాయుధ పోలీసు దళ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా సంభవించిన వినాశకరమైన వరదల కారణంగా నేపాల్‌లో ఇప్పటి వరకు 22 మంది చనిపోయారని తెలిపారు. పృథివీ హైవే వెంబడి ధాడింగ్ జిల్లాలోని ఝ్యాప్లే ఖోలాలో బురదజల్లు కింద కూరుకుపోయిన రెండు వాహనాల నుండి 14 మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు.
ఆగ్నేయ నేపాల్‌లోని కోషి నది ప్రమాదకరస్థాయిని మించి ప్రవహిస్తోందని అన్నారు. నదిలో నీటి ప్రవాహం సాధారణం కన్నా రెండింతలు ఉన్నట్లు తెలిపారు. 56 సూయిజ్ గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నామని అన్నారు. వరదల్లో శనివారం 11మంది కొట్టుకుపోయారని వారి కోసం గాలింపు చర్యలు చేపట్టామని వెల్లడించారు. కొండచరియలు విరిగిపడటంతో రహదారులు బ్లాక్ అయ్యాయని, దీంతో వందలాది మంది ప్రయాణికులు చిక్కుకుపోయారని అన్నారు. వర్షాలకు దేశీయ విమానాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయని అన్నారు. మరో రెండు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది.