SURAT: కాంగ్రెస్సే నన్ను మోసం చేసింది
20 రోజుల తర్వాత తొలిసారి కనిపించిన సూరత్ కాంగ్రెస్ అభ్యర్థి.... కాంగ్రెస్‌ను ను మోసం చేయాలని తాను అనుకోలేదన్న కుంభానీ;
సూరత్ లోక్ సభ స్థానం బీజేపీకి ఏకగ్రీవమవడానికి కారణమైన బహిష్కృత కాంగ్రెస్ నేత నీలేష్ కుంభానీ అదృష్యమైన 20 రోజులకు తొలిసారి కనిపించారు. కాంగ్రెస్‌ను తాను మోసం చేయలేదనీ కాంగ్రెస్సే తనకు ద్రోహం చేసిందని కుంభానీ ఆరోపించారు. 2017 అసెంబ్లీ ఎన్నికల సమయంలో చివరిక్షణంలో కమ్రెజ్ అసెంబ్లీ స్థానం టికెట్ కేటాయింపును హస్తం పార్టీ రద్దు చేసిందని గుర్తు చేసుకున్నారు. కాంగ్రెస్ ను మోసం చేయాలని తాను అనుకోలేదనీ అయితే సూరత్ లో ఐదుగురు కీలక నేతలు అంతా తామై వ్యవహరిస్తూ ఇతరులను పని చేసుకోనివ్వట్లేదని మండిపడ్డారు. అందుకే తన మద్దతుదారులు, కార్యాలయ సిబ్బంది, కార్యకర్తలు కలత చెందారని నీలేష్ వివరించారు.
నీలేష్ ప్రతిపాదకులు నామినేషన్ పత్రంపై సంతకాలు చేయలేదంటూ జిల్లా ఎన్నికల రిటర్నింగ్ అధికారి నామినేషన్ తిరస్కరించారు. తర్వాత ఇతర పార్టీ అభ్యర్థులూ నామినేషన్ లను ఉపసంహరించుకోగా బీజేపీ అభ్యర్థి ఖేష్ దలాల్ సూరత్ నుంచి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అప్పటి నుంచి నీలేష్ కుంభానీ కనిపించలేదు. నీలేష్ కుంభానీ ఏప్రిల్ 22 నుండి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఆ తర్వాత ఆయనను కాంగ్రెస్ సస్పెండ్ చేసింది. నామినేషన్ ఫాంను తిరస్కరించినందుకు ఆయనపై ఆరోపణలు గుప్పించింది. నీలేష్ కుంభానీ బీజేపీతో కుమ్మక్కయ్యాడని కాంగ్రెస్ విమర్శలు గుప్పించింది.
కాంగ్రెస్, ఆప్ ఇండియా కూటమిలో భాగమైనప్పటికీ.. ఆప్ నేతలతో కలిసి ప్రచారం చేసినప్పుడు కాంగ్రెస్ అభ్యంతరం వ్యక్తం చేసిందని కుంభానీ విమర్శించారు. లోక్‌సభ ఎన్నికల్లో జరిగిన పరిణామాలు కాంగ్రెస్‌పై ప్రతీకారమేనా అని అడిగిన ప్రశ్నకు నీలేష్ కుంభానీ జవాబు చెప్పేందుకు నిరాకరించారు. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ రద్దు గురించి చేసిన ఆరోపణల్ని పునరుద్ఘాటించారు. గతంలో సూరత్ మున్సిపల్ కార్పొరేషన్‌లో కాంగ్రెస్ కార్పొరేటర్‌గా పనిచేసిన నీలేష్ కుంభానీ 2022 అసెంబ్లీ ఎన్నికల్లో కమ్రెజ్ నుంచి పోటీ చేసి బీజేపీ చేతిలో ఓడిపోయారు. ఏప్రిల్ 21న, నీలేష్ కుంభానీ నామినేషన్‌ను రిటర్నింగ్ అధికారి తిరస్కరించారు . ముగ్గురు ప్రతిపాదకులు నామినేషన్ పత్రంపై సంతకం చేయలేదని పేర్కొంటూ ఎన్నికల అధికారికి అఫిడవిట్ లు సమర్పించారు. అదే టైంలో కాంగ్రెస్ ప్రత్యమ్నాయ అభ్యర్థి సురేష్ పడసాల నామినేషన్ ని కూడా తిరస్కరించారు.