ఒడిశాలో అధికారం కోల్పోయినందుకు సిగ్గుపడాల్సిన అవసరం లేదని ఆ రాష్ట్ర మాజీ సీఎం నవీన్ పట్నాయక్ అన్నారు. కొత్తగా ఎన్నికైన తమ పార్టీ ఎమ్మెల్యేలతో ఆయన మాట్లాడారు. తాను తొలిసారి సీఎం అయినప్పుడు రాష్ట్రంలో 70% ప్రజలు దారిద్ర్య రేఖకు దిగువన ఉండేవారని, దాన్ని 10శాతానికి తగ్గించానని గుర్తుచేశారు. 24ఏళ్లుగా రాష్ట్రానికి బీజేడీ సేవలందించిందని, ఇంకా పనిచేస్తూనే ఉంటుందన్నారు.
ఈ ఎన్నికల్లో బీజేపీకి 78, బీజేడీకి 51 సీట్లు వచ్చాయి. 24 ఏళ్లుగా అవిచ్ఛిన్నంగా ముఖ్యమంత్రి పదవిలో కొనసాగిన నవీన్ పటా్నయక్ బుధవారం రాజీనామా చేశారు. తన రాజీనామా పత్రాన్ని రాష్ట్ర గవర్నర్ రఘువర్ దాస్‌కు సమర్పించారు. ఒడిశా శాసనసభ ఎన్నికల్లో బీజేడీ పరాజయం పాలైంది.
147 స్థానాలకు గాను కేవలం 51 స్థానాలు గెలుచుకుంది. బీజేపీ ఏకంగా 78 సీట్లు సాధించింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతోంది. నవీన్ పట్నాయక్ 2000 సంవత్సరం మార్చి 5న తొలిసారిగా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అప్పటి నుంచి పదవిలో కొనసాగారు. తాజా ఎన్నికల్లో ఓటమి ఎదురుకావడంతో పదవి నుంచి తప్పుకున్నారు. ఇక ప్రతిపక్ష పాత్ర పోషించబోతున్నారు.