జమ్ముకాశ్మీర్ ముఖ్యమంత్రిగా నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ నేత ఒమర్ అబ్దుల్లా రెండోసారి ప్రమాణ స్వీకారం చేశారు. షేర్ ఈ కశ్మీర్ ఇంటర్నేషనల్ కన్వెషన్ సెంటర్ లో వేడుక జరిగింది. సీఎంగా ఒమర్ అబ్దుల్లా చేత జమ్ము కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ప్రమాణం చేయించారు. ఆయనతో పాటు ఐదుగురు ఎమ్మెల్యేలు జావేద్ దర్, సఖీనా ఇట్టో, జావేద్ రానా, సురేందర్ చౌదరీ, సతీష్ శర్మ కేబినెట్ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. వీరిలో సతీష్ శర్మ చంబ్ అసెంబ్లీ స్థానం నుంచి స్వతంత్ర ఎమ్మెల్యేగా
ఎన్నికయ్యారు. కాగా జమ్ముకాశ్మీర్ ప్రభుత్వా నికి తాము బయట నుంచి మద్దతిస్తామని కాంగ్రెస్ ప్రకటించింది. అలాగే ఒమర్ అబ్దుల్లా ప్రమాణస్వీకారానికి కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సైతం హాజర య్యారు. ఈ వేడుకకు ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్, ఎన్సీపీ (శరద్ పవార్ వర్గం వర్కింగ్ ప్రెసిడెంట్ సుప్రియా సులే, సీపీఎం సెంట్రల్ కమిటీ నేత ప్రకాశ్ కారత్, డీఎంకే డిప్యూటీ జనరల్ సెక్రటరీ కనిమొళి, సీపీఐ జనరల్ సెక్రటరీ డీ. రాజా హాజరయ్యారు. కాగా ఒమర్ అబ్దుల్లా గతంలో 2009 నుండి 2014 వరకు జమ్ముకాశ్మీర్ ముఖ్యమంత్రిగా సేవలందించారు.