PAN-Aadhaar Link Deadline : షాకింగ్ న్యూస్.. జనవరి 1, 2026 నుంచి పాన్ కార్డులు పనిచేయవు.

Update: 2025-11-06 05:15 GMT

 PAN-Aadhaar Link Deadline : ప్రస్తుత డిజిటల్ యుగంలో ఆర్థిక లావాదేవీలకు అత్యంత ముఖ్యమైన పత్రాలలో పర్మనెంట్ అకౌంట్ నంబర్ (PAN) ఒకటి. ఈ పాన్ కార్డును ఆధార్ కార్డుతో అనుసంధానం చేయడం కేంద్ర ప్రభుత్వం తప్పనిసరి చేసింది. అయితే, ఈ గడువును పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేసే వారికి కేంద్ర ప్రభుత్వం భారీ హెచ్చరిక జారీ చేసింది. ఆధార్‌తో లింక్ చేయని పాన్ కార్డులు వచ్చే ఏడాది జనవరి 1, 2026 నుంచి పూర్తిగా డీయాక్టివేట్ కానున్నాయి. ఒకవేళ మీ పాన్ కార్డు డీయాక్టివేట్ అయితే ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతాయి? గడువులోగా లింక్ చేయకపోతే తీసుకోవాల్సిన చర్యలు ఏంటి? అనే పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.

ఆదాయపు పన్ను శాఖ జారీ చేసిన పాన్ కార్డును ఆధార్‌తో అనుసంధానించడం తప్పనిసరి చేసిన విషయం తెలిసిందే. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ ఈ విషయంలో స్పష్టమైన గడువును ప్రకటించింది. 2025 అక్టోబర్ 1వ తేదీకి ముందు పాన్ కార్డు పొందిన వారందరూ తప్పనిసరిగా 2025 డిసెంబర్ 31లోపు ఆధార్‌తో లింక్ చేయాలి. ఈ గడువులోగా లింక్ చేయని పాన్ కార్డులు 2026 జనవరి 1 నుంచి డీయాక్టివేట్ అవుతాయి. ఒకసారి డీయాక్టివేట్ అయితే, ఆ పాన్ కార్డు ఉన్నా లేనట్టే లెక్క.

పాన్ అనేది ఆదాయపు పన్ను శాఖ ప్రతి వ్యక్తికి ఇచ్చే 10 అంకెల గుర్తింపు సంఖ్య. పన్ను ప్రయోజనాల కోసం, అలాగే బ్యాంక్ అకౌంట్ తెరవడం నుంచి పెద్ద మొత్తంలో నగదు డిపాజిట్ చేయడం వరకు అనేక ఆర్థిక కార్యకలాపాలకు ఇది తప్పనిసరి. ఒక వ్యక్తి పాన్ కార్డు డీయాక్టివేట్ అయితే, వారు అనేక ఆర్థిక సేవలు, లావాదేవీలను నిర్వహించడంలో ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఐటీ రిటర్న్‌లు దాఖలు చేయడం సాధ్యం కాదు. ఒకవేళ దాఖలు చేసినా, వాటిని ప్రాసెసింగ్ చేయరు. రీఫండ్‌లు కూడా పొందలేరు.

ముఖ్యంగా, ట్యాక్స్ డిడక్టెడ్ ఎట్ సోర్స్ (TDS) లేదా ట్యాక్స్ కలెక్టెడ్ ఎట్ సోర్స్ (TCS) మినహాయించాల్సి వస్తే, 10 శాతం బదులు ఏకంగా 20 శాతం అధిక పన్నును మినహాయిస్తారు. కొత్త బ్యాంక్ అకౌంట్‌ను తెరవడం, పెద్ద మొత్తంలో నగదును డిపాజిట్ చేయడం, ఉద్యోగులకు జీతం క్రెడిట్ కావడం, సిప్ వంటి అనేక ఆర్థిక కార్యకలాపాలు నిలిచిపోతాయి.

పాన్-ఆధార్ లింక్ చేసే విధానం

పాన్-ఆధార్‌ను ఆన్‌లైన్ ద్వారా చాలా సులభంగా అనుసంధానం చేసుకోవచ్చు.

⦁ ముందుగా ఆదాయపు పన్ను శాఖ ఈ-ఫైలింగ్ వెబ్‌సైట్ (www.incometax.gov.in) ను సందర్శించాలి.

⦁ వెబ్‌సైట్ హోమ్‌పేజీలో ఉన్న 'క్విక్ లింక్స్' సెక్షన్ కింద ఉన్న 'లింక్ ఆధార్' అనే ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.

⦁ మీ 10 అంకెల పాన్ నంబర్, 12 అంకెల ఆధార్ నంబర్‌ను నమోదు చేయాలి.

⦁ ఆధార్‌కు లింక్ అయిన మొబైల్ నంబర్‌కు వచ్చిన OTPని ఎంటర్ చేసి 'వాలిడేట్' (Validate) పై క్లిక్ చేయాలి.

గడువు దాటితే జరిమానా

ఒకవేళ మీరు డిసెంబర్ 31 తర్వాత పాన్-ఆధార్‌ను లింక్ చేయాల్సి వస్తే, దానికి జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. గడువు దాటిన తర్వాత లింక్ చేసే వారికి రూ.1,000 పెనాల్టీ ఉంటుంది. పాన్, ఆధార్ నంబర్‌లను నమోదు చేసి వాలిడేట్ ఆధార్ పై క్లిక్ చేసినప్పుడు, పెనాల్టీ చెల్లించాల్సిన సూచన వస్తుంది. అప్పుడు 'కంటిన్యూ టు పే త్రూ ఇ-పే ట్యాక్స్' ఆప్షన్ ద్వారా పేమెంట్ చెల్లించి, ఆ తర్వాత మళ్లీ ఈ-ఫైలింగ్ వెబ్‌సైట్‌కి వచ్చి పాన్-ఆధార్ లింకింగ్ ప్రక్రియను పూర్తి చేయవచ్చు.

Tags:    

Similar News