పార్లమెంట్ సమావేశాల తేదీలు ఖరార య్యాయి. అదేవిధంగా ఎంపీల ప్రమాణ స్వీకారంతోపాటు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించే కార్యక్రమాలు కూడా ఫైనలయ్యాయి. నరేంద్ర మోడీ ( PM Modi ) నేతృత్వంలో కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పార్లమెంట్ కు ఇది తొలి సెషన్. పార్లమెంట్ ఉభయ సభలు ఈ నెల 24 నుంచి ప్రారంభం కానున్నాయి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 27న ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తారు.
రానున్న ఐదేళ్ల కాలంలో ప్రధాన మోడీ ప్రభుత్వ కార్యాచరణను ముర్ము తన ప్రసంగంలో వివరించ నున్నారు. లోక్సభ ఎన్నికల్లో మెజార్టీ సీట్లు సాధించిన బీజేపీ నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్డీయే) కేంద్రంలో సంకీర్ణంగా రావడంతో నరేంద్ర మోడీ ప్రధానిగా మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. దాంతో ఇప్పుడు 18వ లోక్సభ ప్రత్యేక సమావేశాలు నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు.
ఈ పార్లమెంట్ సమావేశాలు జూన్ 24 న ప్రారంభమై వచ్చే నెల 3 వరకు కొనసాగే అవకాశాలు ఉన్నాయి. కొత్త ఎంపీలు జూన్ 24, 25 తేదీల్లో ప్రమాణ స్వీకారం చేస్తారని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు. జూన్ 26న స్పీకర్ ఎన్నిక జరగనుంది. రాజ్యసభ 264వ సమావేశాలు జూన్ 27 నుంచి ప్రారంభమై జూలై 3 వరకు కొనసాగు తాయని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరెన్ రిజిజు తెలిపారు.