Shirdi Sai Baba Temple: షిర్డీ బాబా భక్తులకు అలెర్ట్.
ఇక ఆలయంలోకి ఈ వస్తువులు తీసుకెళ్లడంపై నిషేధం..!;
భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో షిర్డీ సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ కీలక నిర్ణయం తీసుకున్నది. బాబా ఆలయంలోకి పూల దండలు, పుష్పగుచ్ఛాలు, శాలువాలను తీసుకెళ్లడంపై నిషేధం విధించింది. భద్రతను దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంస్థాన్ ట్రస్ట్ వర్గాలు తెలిపాయి. భక్తులు ఆలయంలోకి వెళ్లే ముందు క్షుణ్ణంగా తనిఖీలు చేయనున్నారు. ఇప్పటి వరకు భక్తులు తాము కొనుగోలు చేసిన ప్రసాదాలు, ఫొటోలు, శాలువాలతో పాటు బాబాను అలకరించేందుకు పూలు తీసుకెళ్లేందుకు అనుమతి ఉండేది. ఇదిలా ఉండగా.. ఏటా బాబా దర్శనానికి దేశ విదేశాల నుంచి లక్షలాది మంది భక్తులు తరలివస్తుంటారు.
అయితే, గతవారం కింద ఆలయానికి బెదిరింపు ఈ-మెయిల్ వచ్చింది. ఈ క్రమంలో భద్రతను దృష్టిలో పెట్టుకొని ఆలయానికి దండలు, పుష్పాలు, శాలువాలు తీసుకెళ్లడానికి అనుమతించకూడదని ఆలయ ట్రస్ట్ నిర్ణయించింది. సాయి బాబా సంస్థాన్ ట్రస్ట్ సభ్యుడు గోరక్ష్ గడిల్కర్ మాట్లాడుతూ ఆలయంలోకి ప్రవేశించే ముందు భక్తులను తనిఖీ చేయనున్నట్లు తెలిపారు. మే 2న ట్రస్ట్‌కు బెదిరింపు ఈ-మెయిల్ వచ్చిందని ఆయన చెప్పారు. భారతదేశం-పాకిస్తాన్ ఉద్రిక్తతలు, హెచ్చరికల నేపథ్యంలో పలు నిర్ణయాలు తీసుకున్నట్లు చెప్పారు. ఇదిలా ఉండగా.. అహలయనగర్ జిల్లా పోలీసులు ఆలయంలో భద్రతను పెంచేందుకు పలు సూచనలు చేశారు. ఇదిలా ఉండగా.. ముంబయిలోని సిద్ధివినాయక ఆలయం సైతం మే 11 నుంచి ఆలయంలోకి దండలు, ప్రసాదం, కొబ్బరికాయలను తీసుకెళ్లేందుకు అనుమతి ఇవ్వడం లేదని స్పష్టం చేసింది.