Supreme Courts: వీధి కుక్కలు కనిపించకూడదు సుప్రీంకోర్టు
ఢిల్లీ అధికారులకు సుప్రీంకోర్టు సీరియస్ ఆదేశం;
దేశ వ్యాప్తంగా కుక్కల బెడద పెరిగిపోయింది. చిన్నాపెద్ద అనే తేడా లేకుండా మనుషులపై కుక్కల గుంపు దాడులు చేయడంతో ఇప్పటికే అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. ఇలా ఆయా రాష్ట్రాల్లో ఎక్కడో చోట జరుగుతూనే ఉంటున్నాయి. దీంతో ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్నాయి. మనుషుల ప్రాణాలు పోతుంటే ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయని ప్రశ్నిస్తున్నారు.
తాజాగా ఢిల్లీ-ఎన్‌సీఆర్ పరిధిలోని వీధి కుక్కలను వెంటనే పట్టుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. తక్షణమే వీధి కుక్కలను పట్టుకోవాలని.. శాశ్వతంగా షెల్టర్లకు తరలించాలని సూచించింది. ఈ ప్రక్రియకు ఆటంకం కలిగించే ఏ వ్యక్తి లేదా సంస్థ అయినా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సుప్రీం ధర్మాసనం తీవ్రంగా హెచ్చరించింది. 6 వారాల్లోపు వీధి కుక్కలన్నింటినీ పట్టుకోవాలని తెలిపింది. అన్ని కుక్కలను క్రిమిరహితం చేసి శాశ్వతంగా ఆశ్రయాలకు తరలించాలని ఉత్తర్వులో న్యాయస్థానం పేర్కొంది. ఈ విషయంలో ఏ మాత్రం రాజీ లేకుండా ఈ ప్రక్రియ పూర్తి చేయాలని స్పష్టం చేసింది.
ఒకవేళ కుక్కల ఏరివేతకు ఒక బృందం కావాల్సి వస్తే ఏర్పాటు చేసుకోవాలని పేర్కొంది. అన్ని ప్రాంతాల నుంచి వీధి కుక్కలను త్వరగా తొలగించాల్సిందేనని జేబీ పార్దివాలా, జస్టిస్ ఆర్. మహాదేవన్ లతో కూడిన ధర్మాసనం పేర్కొంది.
ఎవరైనా ప్రతిఘటిస్తే కఠిన చర్యలు తాము తీసుకుంటామని తెలిపింది. అడ్డుకునే ప్రయత్నం చేసే జంతు ప్రేమికులందరూ ప్రాణాలు కోల్పోయిన పిల్లలను తిరిగి తీసుకురాగలరా అని జస్టిస్ పార్దివాలా ప్రశ్నించారు. ఇది మా స్వార్థ ప్రయోజనాల కోసం కాదని.. ప్రజల కోసమేనని కోర్టు పేర్కొంది. ఇందులో ఎటువంటి భావోద్వేగాలు జోడించొద్దని పేర్కొంది. ఎట్టి పరిస్థితుల్లో శిశువులు, చిన్న పిల్లలు రేబిస్ బారిన పడకూడదని తెలిపింది. ప్రజలు వీధుల్లో స్వేచ్ఛగా తిరిగే పరిస్థితి కల్పించాలని వ్యాఖ్యానించింది. ఢిల్లీ, నోయిడా, గురుగ్రామ్‌లలో పట్టుకున్న కుక్కల రికార్డులను భద్రపరచాలని.. ఎట్టి పరిస్థితుల్లో వదలొద్దని.. ఈ నియమాన్ని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని న్యాయస్థానం హెచ్చరించింది. అలాగే కుక్క కాటు, రాబిస్ కోసం ఒక వారంలోపు హెల్ప్‌లైన్‌ను ఏర్పాటు చేయాలని ఆదేశించింది. ఇటీవల కాలంలో ఢిల్లీలో కుక్కకాటు కారణంగా ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో సుప్రీం కోర్టు ఈ కఠిన నిర్ణయం తీసుకుంది.