Vijay Mallya : రూ. 14,100 కోట్ల వసూళ్లు నిజమేనా? బ్యాంకులు లెక్క చెప్పాలంటూ విజయ్ మాల్యా డిమాండ్
Vijay Mallya : ప్రముఖ వ్యాపారవేత్త విజయ్ మాల్యా మరోసారి భారతీయ బ్యాంకులకు సవాల్ విసిరారు. తన ఆస్తుల ద్వారా బ్యాంకులు చేసిన వసూళ్లకు సంబంధించి పూర్తి లెక్కలు ఇవ్వడం లేదని ఆయన భారత ప్రభుత్వ రంగ బ్యాంకులను బహిరంగంగా విమర్శించారు. కేంద్ర ఆర్థిక మంత్రి రూ. 14,100 కోట్లు బ్యాంకులకు తిరిగి వచ్చాయని అధికారికంగా ధృవీకరించినప్పటికీ, వసూళ్ల వివరాలను బ్యాంకులు ప్రజల ముందు ఎందుకు ఉంచడం లేదని మాల్యా ప్రశ్నించారు. ఈ నిర్లక్ష్యంపై బ్యాంకులు సిగ్గుపడాలి అంటూ ఆయన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌లో పోస్ట్ చేశారు.
కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ తీసుకున్న రుణాల విషయంలో భారతీయ ప్రభుత్వ రంగ బ్యాంకులు తన నుంచి డబ్బులు రాబట్టాలని వాదిస్తున్నాయని, అయితే ఆస్తుల స్వాధీనం ద్వారా జరిగిన వసూళ్ల లెక్కలను మాత్రం సరిగా చూపడం లేదని విజయ్ మాల్యా ఆరోపించారు. కేంద్ర ఆర్థిక మంత్రి స్వయంగా రూ. 14,100 కోట్లు బ్యాంకులకు తిరిగి వచ్చాయని చెప్పినప్పటికీ, బ్యాంకులు ఇప్పటికీ సరైన వివరాలను ప్రజలకు ఎందుకు అందించడం లేదని మాల్యా ప్రశ్నించారు. వసూలు చేసిన పూర్తి సమాచారాన్ని బ్యాంకులు బహిరంగపరిచే వరకు, తాను బ్రిటన్‌లో ఎటువంటి చట్టపరమైన చర్యలను కొనసాగించబోనని మాల్యా స్పష్టం చేశారు. తనపై జరుగుతున్న చట్టపరమైన ప్రక్రియకు సరైన సమాధానం భారత్‌లో మాత్రమే ఇవ్వగలమని ఆయన పేర్కొన్నారు.
ఈ వివాదం అంతా విజయ్ మాల్యాకు చెందిన కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ తీసుకున్న బకాయి రుణాల వసూలుకు సంబంధించినది. భారతీయ బ్యాంకులు మాల్యా ఆస్తులను స్వాధీనం చేసుకుని, వాటిని విక్రయించడం ద్వారా కొంత మొత్తాన్ని రుణంలో జమ చేశామని పేర్కొన్నాయి. అయితే, వసూలు చేసిన మొత్తానికి సంబంధించి బ్యాంకులు పారదర్శకత చూపడం లేదని మాల్యా ఆరోపణ. ఇదిలా ఉండగా, మాల్యా బ్రిటన్‌లో తనపై దాఖలైన దివాలా ఉత్తర్వును రద్దు చేయాలంటూ దాఖలు చేసిన దరఖాస్తును తాజాగా ఉపసంహరించుకున్నారు.
దివాలా రద్దు కోసం మాల్యా దాఖలు చేసిన దరఖాస్తును ఉపసంహరించుకోవడం వల్ల, దివాలా ట్రస్టీకి పెద్ద ఊరట లభించింది. దీంతో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇతర బ్యాంకుల తరపున కింగ్‌ఫిషర్‌కు సంబంధించిన సుమారు 1.05 బిలియన్ పౌండ్ల (సుమారు రూ. 10,000 కోట్లకు పైగా) రుణాన్ని వసూలు చేసేందుకు ట్రస్టీకి మార్గం సుగమమైంది. బ్రిటీష్ ఉన్నత న్యాయస్థానం ఏప్రిల్ నెలలో మాల్యాపై దివాలా ఉత్తర్వును సమర్థించింది. మాల్యా గతంలో తన అప్పీల్‌లో, భారతదేశంలో బ్యాంకులు అప్పును పూర్తిగా వసూలు చేశాయని వాదించినా, భారత్‌లో దానికి సంబంధించిన కేసుల్లో పురోగతి లేకపోవడం వల్ల బ్రిటన్‌లో ఈ కేసు ఇంకా కొనసాగుతోంది.