Wife harassment: భార్య వేధింపులకు మరో భర్త బలి..
తప్పుడు వరకట్న వేధింపులు పెట్టారని ఆరోపణ.. చట్టాలను మార్చాలని సూసైడ్ నోట్..;
భార్య వేధింపులు తాళలేక ఒక యువ ఫొటోగ్రాఫర్ ఆత్మహత్య చేసుకున్నాడు. వరకట్న నిరోధక చట్టంలో మార్పులు చేయాలని, మహిళలు దానిని దుర్వినియోగం చేయకుండా నిరోధించాలని తన సూసైడ్ నోట్‌లో ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాడు. దీనిపై కేసు నమోదు చేసిన మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ పోలీసులు అతని భార్య, తల్లి, ఆమె ఇద్దరు కుమార్తెలపై కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళితే.. ఫొటోగ్రాఫర్‌గా పనిచేసే నితన్ పడియార్(28)పై అతని భార్య రాజస్థాన్‌లో వరకట్న వేధింపుల కేసు నమోదు చేయడంతో 20న ఆత్మహత్య చేసుకున్నాడు. ఇలాంటి తప్పుడు కేసుల ద్వారా తీవ్ర అన్యాయానికి గురవుతున్నారని, యువకులు పెండ్లి చేసుకోవద్దని సూసైడ్ నోట్‌లో కోరాడు.
ఆత్మహత్యకు ప్రేరేపించినందుకు అతని భార్య, ఆమె తల్లి, ఇద్దరు సోదరీమణులపై ఎఫ్ఐఆర్ నమోదైంది. పడయార్ భార్య రాజస్థాన్‌లో అతడిపై వరకట్న వేధింపుల కేసుని నమోదు చేసింది. ఈ కేసుని విత్ డ్రా చేసుకోవడానికి వారు పడియార్ నుంచి భారీగా డబ్బులు డిమాండ్ చేశారు. పడియార్ ఆత్మహత్య చేసుకుంటూ ‘‘ వరకట్న వేధింపుల చట్టాన్ని మార్చాలని అభ్యర్థిస్తున్నాను.మీరు దానిని మార్చకుంటే ప్రతీరోజు చాలా మంది మగాళ్లు, వారి కుటుంబాలు నాశనం అవుతాయి. భారతదేశంలోని యువత వివాహాలు చేసుకోవద్దు. నా మరణం తర్వాత నన్ను వేధించారని భావిస్తే నాకు న్యాయం చేయండి’’ అంటూ సూసైడో నోట్ రాశాడు.