modi: 2036 ఒలింపిక్స్ భారత్‌లోనే
క్రీడా సంస్కృతి దిశగా భారత్ పురోగమిస్తోందన్న ప్రధాని;
బిహార్‌లో 7వ ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌ను ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. పాట్నాలో జరిగిన ఈ ప్రారంభోత్సవ వేడుకలో బీహార్ సీఎం నితీష్ కుమార్, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా క్రీడాకారులను ఉద్దేశించి కీలక ఉపన్యాసం చేశారు. దేశంలో క్రీడలు ఒక ప్రత్యేకమైన సాంస్కృతిగా అభివృద్ధి చెందుతున్నాయన్న మోదీ.. అథ్లెట్ల అద్భుతమైన నైపుణ్యాలు, క్రీడల పట్ల వారికున్న మక్కువ దేశానికి గర్వకారణమన్నారు. 2036 ఒలింపిక్స్‌ను మనదేశంలో నిర్వహించడానికి ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పుకొచ్చారు. భారతదేశంలో క్రీడలకు పెరుగుతున్న ప్రాధాన్యతను మోదీ ప్రశంసించారు. భారతదేశం క్రమంగా పటిష్ట క్రీడా సంస్కృతి దిశగా పురోగమిస్తోందన్నారు. ఎంతగా క్రీడా సంస్కృతి విస్తరిస్తుందో, అంతగా ఇండియా సాఫ్ట్ పవర్ పెరుగుతుందని, ఎంత ఆడితే అంత షైన్ అవుతారని క్రీడాకారులకు దిశానిర్దేశం చేశారు. బిహార్‌కు చెందిన యంగ్ క్రికెటర్ సూర్యవంశీ ఆటతీరును హైలైట్ చేస్తూ, వైభవ్ విజయం వెనుక అతని అంకితభావం ఉందని, క్రీడాకారులు వివిధ స్థాయిలో ఎంత ఎక్కువగా ఆడితే అంతగా రాణిస్తారని అన్నారు.
వైభవ్‌పై మోదీ ప్రశంసలు
ఐపీఎల్‌లో తన ఆటతో అదరగొడుతున్న 14 ఏళ్ల కుర్రాడు వైభవ్ సూర్యవంశీ పై ప్రధాని మోదీ ప్రశంసలు కురిపించారు. ఖేలో ఇండియా యూత్ గేమ్స్ ను ప్రధాని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బిహార్ బిడ్డ వైభవ్ సూర్య వంశీ చిన్న వయసులోనే అద్భుతంగా ఆడుతున్నాడని అన్నారు. అంత చిన్నవయసులో రికార్డులు సృష్టిస్తున్నాడని ప్రశంసించారు. క్రీడల ద్వారా తమలో ఉన్న టాలెంట్ బయటపడుతుందని చెప్పారు.