AGE: క్రికెట్లో వయసు మోసం జరుగుతూనే ఉందా..?
స్టార్ బాక్సర్ విజేందర్ వ్యాఖ్యలతో వివాదం;
క్రికెట్ ప్రపంచంలో వైభవ్ సూర్యవంశీ గురించి చర్చ జరుగుతూనే ఉంది. ఈ ఐపీఎల్ సీజన్ లో తొలి మ్యాచ్ ఆడిన వైభవ్.. తొలి బంతికే సిక్సు బాదాడు. ఆ తర్వాత మూడో మ్యాచులో ఫాస్టెస్ట్ సెంచరీతో ప్రకంపనలు సృష్టించాడు. 14 ఏళ్ల వయస్సులోనే 35 బంతుల్లో శతకం బాదిన అతిపిన్న వయస్సులోనే సెంచరీ చేసిన భారతీయ ఆటగాడిగా వైభవ్ సూర్యవంశీ రికార్డును సాధించాడు. ఈ శతకం తర్వాత వైభవ్ సూర్యవంశీ వయసుపై చాలామంది అనుమానం వ్యక్తం చేశారు. సూర్యవంశీ వయసు 14 కంటే ఎక్కువగానే ఉంటుందని.. కానీ తక్కువగా చూపిస్తున్నాడని విమర్శలు గుప్పించారు. తాజాగా స్టార్ బాక్సర్ విజేందర్ సింగ్ చేసిన వ్యాఖ్యలు.. ఈ వివాదాన్ని మరింత పెంచాయి.
విజేందర్ సింగ్ ఏమన్నాడంటే..?
క్రికెటర్లు తక్కువ వయస్సును చూపి ఆడుతున్నారని భారత మాజీ బాక్సర్ విజేందర్ సింగ్ ట్వీట్ చేశాడు. ఐపీఎల్ స్టార్ ఆటగాడు వైభవ్ సూర్యవంశీని ఉద్దేశించి టార్గెట్ చేసి ఉంటారని నెటిజన్లు భావిస్తున్నారు. ఈ అంశంపై నెట్టింట జోరుగా చర్చ జరుగుతోంది. 14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడుతున్నాడు. కొంత మంది క్రికెటర్లు వయస్సు తక్కువ చెప్పి ఆడుతున్నారని తన ట్వీట్ లో వ్యాఖ్యాన్నించాడు. అయితే విజేందర్ చేసిన ట్వీట్ లో ఎవరి గురించి ఆ మాట అన్నాడో సూటిగా లేదు. కాకపోతే వైభవ్ సూర్యవంశీ గురించి ఆ వ్యాఖ్యలు చేసి ఉంటారని నెటిజన్లు భావిస్తున్నారు. ఇటీవల వైభవ్ సూర్యవంశీ వయస్సుపై అనుమానాలు వ్యక్తం కావడంతో చాలా మంది సోషల్ మీడియాలో వైభవ్ కు సంబంధించి పాత వీడియోలను పంచుకున్నారు. ఆ వీడియోలలో వైభవ్ వయస్సు కన్నా ఎక్కువ ఏజ్ లో ఉన్నట్లు కనిపించాడు. సోషల్ మీడియాలో పలువురు అతని వయస్సుపై సందేహాలు వ్యక్తం చేశారు. ఇప్పుడు బీసీసీఐ దర్యాప్తు చేయాల్సిన అవసరం ఏర్పడింది, వాస్తవాలు ఏవైనా బయటకురావాల్సిందే అని కొందరు కామెంట్లు చేస్తున్నారు. వయస్సు మోసం క్రీడా రంగాన్ని వెంటాడుతున్న సమస్యగా మారింది.