India and Ireland: కుర్రాళ్లు కొట్టేశారు...
ఐర్లాండ్‌తో రెండో టీ ట్వంటీలో భారత్ గెలుపు... ఒక మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ కైవసం;
యువ ఆటగాళ్లంతా సమిష్టిగా కదంతొక్కడంతో ఐర్లాండ్‌పై టీమ్‌ఇండియా 2-0తో సిరీస్ కైవసం(India seals series) చేసుకుంది. ఐర్లాండ్‌తో టీ20 సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలి ఉండగానే భారత్ సొంతం చేసుకుంది. ఆదివారం రెండో టీ20లో బుమ్రా సేన(Jasprit Bumrah) 33 పరుగుల తేడా(33 runs in the second T20I)తో ఐర్లాండ్(India and Ireland)పై గెలిచింది. తొలి మ్యాచ్‌లో బౌలింగ్‌తో గెలిచిన టీమిండియా... రెండో టీ ట్వంటీలో బ్యాట్‌తో మెరిసి విజయం సాధించింది.
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు శుభారంభం దక్కలేదు. వరుసగా ఫోర్, సిక్సర్ బాది మంచి టచ్‌లో కనిపించిన యశస్వి జైస్వాల్ 18 పరుగులకే వెనుదిరిగాడు. మరోసారి నిరాశను మిగిలుస్తూ హైదరబాద్ కుర్రాడు తిలక్ వర్మ ఒక్క పరుగుకే వెనుదిరిగాడు. విండీస్ పర్యటనలో రాణించిన తిలక్ ఈ సిరీస్‌లోని రెండు మ్యాచ్‌ల్లో నిరాశ పరిచాడు. 47/2తో పవర్‌ప్లేను ముగించిన టీమిండియా... తర్వాత దూకుడు పెంచింది. సంజూ శాంసన్(Sanju Samson) ఈ మ్యాచ్‌లో సత్తాచాటాడు. తొలి 13 బంతుల్లో 14 పరుగులే చేసిన శాంసన్.. తర్వాత చెలరేగిపోయాడు. లిటిల్ ఓవర్లో హ్యాట్రిక్ ఫోర్లతో పాటు ఓ సిక్సర్ బాది తన ఉద్దేశాన్ని చాటాడు. రుతురాజ్(Ruturaj Gaikwad) కూడా బ్యాట్ ఝుళిపించడంతో భారత స్కోరు బోర్డు పరుగుపెట్టింది. దీంతో 6 ఓవర్లలోనే 57 పరుగులు వచ్చాయి. 12 ఓవర్లకు 104/2తో భారత్ భారీస్కోరుపై కన్నేసింది. కానీ మళ్లీ బౌలింగ్‌కు వచ్చిన లెగ్‌స్పిన్నర్ వైట్.. శాంసన్ మెరుపులకు ముగింపు పలికి 71 పరుగుల మూడో వికెట్ భాగస్వామ్యాన్ని విడగొట్టాడు.
అంతర్జాతీయ క్రికెట్లో తొలిసారి క్రీజులోకి వచ్చిన రింకు సింగ్ నెమ్మదిగా బ్యాటింగ్ మొదలెట్టాడు. 39 బంతుల్లో అర్ధశతకం పూర్తి చేసిన రుతురాజ్.. వెంటనే ఔటైపోవడం భారత్‌పై ప్రభావం చూపింది. చివరి రెండు ఓవర్లలో శివమ్ దూబె, రింకూ(Rinku Singh) చెలరేగడంతో భారత్ మెరుగైన స్కోరు సాధించింది. 20 బంతుల తర్వాత జట్టుకు ఓ ఫోర్ అందించిన రింకూ.. వెంటనే రెండు సిక్సర్లు దంచడంతో 19వ ఓవర్లో 22 పరుగులు వచ్చాయి. ఆఖరి ఓవర్లో తొలి రెండు బంతులను దూబె సిక్సర్లుగా మలిచాడు. మరో సిక్సర్‌తో జట్టు స్కోరును 180 దాటించిన రింకూ.. భారీ షాట్‌కు ప్రయత్నించి వెనుదిరిగాడు. చివరి రెండు ఓవర్లలో భారత్ 42 పరుగులు పిండుకుంది. రుతురాజ్ గైక్వాడ్ (58; 43 బంతుల్లో 6×4, 1×6) అర్ధశతకంతో సత్తాచాటాడు. సంజు శాంసన్ (40; 26 బంతుల్లో 5×4, 1×6), ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ రింకూ సింగ్ (38; 21 బంతుల్లో 2×4, 3×6) కూడా రాణించారు.
లక్ష్యఛేదనకు దిగిన ఐర్లాండ్ 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 152 పరుగులు చేసి ఓడిపోయింది. ఆండీ బాల్‌బిర్నీ (72; 51 బంతుల్లో 5×4, 4×6) పోరాడాడు. అయితే బల్బిర్నీ వీరవిహారం భారత శిబిరాన్ని వణికించింది. బుమ్రా (2/15), ప్రసిద్ధ్ కృష్ణ (2/29), రవి బిష్ణోయ్ (2/37) సమష్టిగా రాణించారు. ప్రసిద్ధ్ ఒకే ఓవర్లో స్టిర్లింగ్ (0), టకర్ (0)ను ఔట్ చేసి ఐర్లాండ్‌కు షాక్ ఇచ్చాడు. సిక్సర్ల మోత మోగిస్తున్న బల్బిర్నీ జోరుకు అర్ష్దీప్ బ్రేక్ వేలేశాడు. ఆ తర్వాత మ్యాచ్ పూర్తిగా భారత్ పక్షాన నిలిచింది. నామమాత్రపు చివరి టీ20 బుధవారం జరుగుతుంది.