England: ఇక ఇంగ్లండ్ విధ్వంసాన్ని ఆపగలరా
ప్రపంచకప్ వన్డే జట్టులోకి తిరిగి వచ్చిన బెన్ స్టోక్స్.... రిటైర్మెంట్ నిర్ణయం వెనక్కి.. మరింత బలోపేతమైన బ్రిటీష్ జట్టు..;
వన్డే ప్రపంచకప్-2023కు ముందు డిఫెండింగ్ ఛాంపియన్స్‌కు ఇంగ్లండ్‌కు గొప్ప శుభవార్త అందింది. టాప్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ (Ben Stokes) తన వన్డే రిటైర్‌మెంట్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నాడు. భారత్ వేదికగా జరగనున్న ప్రపంచకప్ (ODI World Cup 2023) బరిలోకి దిగేందుకు సిద్ధమేనని వెల్లడించాడు. ఈ క్రమంలో ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు అతడిని న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌కు ఎంపిక చేసింది. బిగ్ మ్యాన్ ఈజ్ బ్యాక్’ అంటూ ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు(ECB) ట్వీట్ చేసింది. ఆగస్ట్ 30 నుంచి కివీస్‌తో ప్రారంభం కానున్న మూడు వన్డేల సిరీస్ కోసం బెన్ స్టోక్స్‌కు అవకాశం ఇవ్వగా.. సీనియర్ బౌలర్ జోఫ్రా ఆర్చర్‌కు మాత్రం చోటు దక్కలేదు. బెన్ స్టోక్స్ చివరి వన్డే మ్యాచ్ 2022 జులై 19న దక్షిణాఫ్రికాతో ఆడాడు. ఇప్పటి వరకు 105 వన్డేల్లో 2,924 పరుగులు చేశాడు. ఇందులో మూడు సెంచరీలు, 21 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.
ఇంగ్లండ్ వన్డే ప్రపంచకప్ కల 2019లో నెరవేరింది. ఫైనల్‌లో వీరోచిత ఇన్నింగ్స్‌తో బెన్ స్టోక్స్ ఇంగ్లాండ్ కలను నెరవేర్చాడు. వరుసగా రెండోసారి కప్‌ను గెలవాలనే లక్ష్యంతో ఉన్న ఇంగ్లాండ్ జట్టుకు పేస్ ఆల్‌రౌండర్ బెన్‌స్టోక్స్ తిరిగి మళ్లీ జట్టులోకి రావడం కొండంత బలాన్ని ఇచ్చింది. ఇప్పటికే భీకర బ్యాటర్లు ఉన్న బ్రిటీష్ జట్టులో తాజాగా స్టోక్స్ చేరడంతో మరింత బలోపేతమైంది.
మరోవైపు, వన్డే ప్రపంచకప్ కోసం ఇంగ్లాండ్ తమ ప్రాథమిక జట్టును ప్రకటించింది. జోస్ బట్లర్ కెప్టెన్‌గా 15 మందిని ఎంపిక చేసింది. వన్డేల నుంచి రిటైర్‌మెంట్ నిర్ణయాన్ని తీసుకున్న ఆల్‌రౌండర్ బెన్‌స్టోక్స్‌కు ఈ జాబితాలో చోటుదక్కింది. టెస్టు క్రికెట్‌లో సంచలన ఆటతీరుతో ఆకట్టుకుంటున్న యువ బ్యాటర్ హ్యారీ బ్రూక్‌కు ఇంగ్లాండ్ సెలక్టర్లు అవకాశం కల్పించలేదు. ఫాస్ట్ బౌలర్ జోఫ్రా అర్చర్‌ను కూడా ఎంపిక చేయలేదు. అర్చర్‌ని ప్రపంచ కప్ ప్రణాళికలలో ట్రావెలింగ్ రిజర్వ్‌గా మాత్రమే చేర్చుతామని ఇంగ్లాండ్ సెలక్టర్ ల్యూక్ రైట్ స్పష్టం చేశాడు.
డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్ వరల్డ్‌కప్‌లో తమ తొలి మ్యాచ్‌ను అహ్మదాబాద్ వేదికగా అక్టోబర్ 5న గత ఎడిషన్ రన్నరప్ న్యూజిలాండ్‌తో ఆడుతుంది. దీనికి ముందు ఆ జట్టు స్వదేశంలో న్యూజిలాండ్‌తోనే 4 మ్యాచ్‌ల టీ20 సిరీస్, తదుపరి 4 మ్యాచ్‌ల వన్డే సిరీస్ ఆడుతుంది. ఈ సిరీస్‌ల కోసం ఇంగ్లండ్ సెలెకర్లు రెండు వేర్వేరు జట్లను ప్రకటించారు.
వన్డే ప్రపంచ కప్.. ఇంగ్లాండ్ ప్రాథమిక జట్టు ఇదే
జోస్ బట్లర్ (కెప్టెన్), మొయిన్ అలీ, గుస్ అట్కిన్సన్, జానీ బెయిర్‌స్టో, సామ్ కరన్, లియామ్ లివింగ్‌స్టోన్, డేవిడ్ మలన్, ఆదిల్ రషీద్, జో రూట్, జాసన్ రాయ్, బెన్ స్టోక్స్, రీస్ టాప్లీ, డేవిడ్ విల్లీ, మార్క్ వుడ్, క్రిస్ వోక్స్.