Chess Champion Gukesh : రికార్డ్ బ్రేక్ చేసిన చెస్ చాంపియన్ గుకేశ్ దొమ్మరాజు

Update: 2024-12-13 09:45 GMT

చందరంగం యువ కెరటం దొమ్మరాజు గుకేశ్‌ సంచలనం సృష్టించాడు. ప్రపంచ చెస్‌ ఛాంపియన్‌షిప్‌ను సొంతం చేసుకున్నాడు. చైనాకు చెందిన డిఫెండింగ్‌ ఛాంపియన్‌ డింగ్ లిరెన్‌తో జరిగిన తుది పోరులో విజేతగా నిలిచాడు. 14వ రౌండ్‌లో నువ్వా? నేనా? అన్నట్లుగా సాగిన గేమ్‌లో చివరికి విజయం గుకేశ్‌నే వరించింది. విశ్వనాథన్‌ ఆనంద్‌ తర్వాత ప్రపంచ చెస్‌ ఛాంపియన్‌ షిప్‌ను సొంతం చేసుకున్న రెండో భారత ఆటగాడిగా గుకేశ్ చరిత్ర సృష్టించాడు. ప్రపంచ చెస్‌ ఛాంపియన్‌ అయిన అతిపిన్న వయస్కుడిగా గుకేశ్‌ రికార్డు సృష్టించాడు. 18 ఏళ్ల వయస్సులో 18వ ప్రపంచ చెస్‌ ఛాంపియన్‌గా అవతరించాడు. 2012 తర్వాత ప్రపంచ చెస్‌ ఛాంపియన్‌షిప్‌ను సొంతం చేసుకున్న తొలి భారతీయుడు గుకేశ్‌ నిలిచారు. గుకేశ్‌ తమిళనాడులోని తెలుగు కుటుంబానికి చెందిన వ్యక్తి కావడం విశేషం.

సుమారు 5 గంటలపాటు సాగిన 13వ రౌండ్‌లో ప్రత్యర్థులిద్దరూ పాయింట్‌ను పంచుకున్నారు. విజయం కోసం 18 ఏళ్ల గుకేశ్‌ గట్టిగానే ప్రయత్నించినా.. ప్రశాంతంగా ఆడిన 32 ఏళ్ల లిరెన్‌ ఆ అవకాశం ఇవ్వలేదు. దీంతో 68 ఎత్తుల తర్వాత ఇద్దరు ఆటగాళ్లు ఫలితం తేలకుండానే గేమ్‌ ముగించేందుకు అంగీకరించారు. దీంతో చెరో 6.5 పాయింట్లతో మ్యాచ్‌ డ్రా అయ్యింది. 14వ రౌండ్‌లో విజయంతో ఒక పాయింట్‌ సాధించిన గుకేశ్‌ 7.5తో విజేతగా నిలిచాడు. ప్రపంచ చెస్‌ ఛాంఫియన్‌గా నిలిచిన దొమ్మరాజు గుకేశ్‌కు ప్రధాని మోడీ అభినందించారు. ఆయన విజయం చరిత్రాత్మకం, ఆదర్శవంతమని కొనియాడారు. గుకేశ్‌ అసాధారణ ప్రతిభ, కృషి, సంకల్పానికి ఈ ఫలితమే నిదర్శనమని చెప్పారు. అటు గుకేశ్‌ దేశాన్ని గర్వపడేలా చేశారని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి గుకేశ్‌కు ప్రశంశలు అందుతున్నాయి. గుకేశ్‌కు శుభాకాంక్షలు తెలుపుతూ ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్‌ ట్వీట్‌ చేశారు.

Tags:    

Similar News