IPL: కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టుకు బిగ్ షాక్
గాయం కారణంగా వైదొలిగిన ఉమ్రాన్ మాలిక్... ఉమ్రాన్ స్థానంలో సకారియా;
కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టుకు షాక్ తగిలింది. పేస్ సెన్సేషన్ ఉమ్రాన్ మాలిక్ గాయంతో టోర్నీ నుంచి వైదొలిగాడు. దీంతో అతడి స్థానంలో ఎడమచేతి వాటం పేసర్ చేతన్ సకారియాను కేకేఆర్ జట్టులోకి తీసుకుంది. చేతన్‌కు కేకేఆర్ రూ.75 లక్షలు చెల్లించనుంది. కాగా 2021 నుంచి 2024 వరకు సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్‌లో ఉన్న ఉమ్రాన్ మాలిక్ తన బౌలింగ్‌తో ఒక్కసారిగా అందరి దృష్టిలో పడ్డ సంగతి తెలిసిందే.
బరిలో నితీష్ కుమార్ రెడ్డి
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 సీజన్ ప్రారంభానికి ముందు సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు భారీ ఉపశమనం కలగనుంది. ఆ జట్టు ఐదుగురు రిటైన్డ్ ఆటగాళ్లలో ఒకరైన నితీష్ కుమార్ రెడ్డిని లీగ్‌లో పాల్గొనడానికి BCCI అనుమతి ఇచ్చింది. SRH మార్చి 23న రాజస్థాన్ రాయల్స్‌తో తన తొలి మ్యాచ్ ఆడనుంది. ఆ మ్యాచ్‌లో నితీష్ ఆడనున్నారు.
రీ-ఎంట్రీ గురించి ఆలోచించట్లేదు: చాహల్
స్పిన్నర్ కుల్‌దీప్ యాదవ్‌పై భారత మణికట్టు మాంత్రికుడు చాహల్ ప్రశంసలు కురిపించారు. ‘కుల్‌దీప్ ప్రస్తుతం వరల్డ్‌లోనే నంబర్ వన్ మణికట్టు స్పిన్నర్. IPLలో, అంతర్జాతీయ క్రికెట్‌లో అతడు బౌలింగ్ చేస్తున్న తీరే ఇందుకు నిదర్శనం. మా ఇద్దరి మధ్య మైదానంలో, వెలుపల మంచి అనుబంధం ఉంది. ఇక భారత జట్టులోకి పునరాగమనం చేయడం అనేది నా చేతుల్లో లేదు. కాబట్టి దాని గురించి ఆలోచించను’ అని అన్నారు.
ఒంటరిగా కూర్చుని బాధపడాలనుకోరు: కోహ్లీ
టీమ్ ఇండియా పర్యటనల సమయంలో కుటుంబాలు దగ్గర ఉండే విషయంపై కోహ్లీ కీలక వ్యాఖ్యలు చేశారు. 'ఆటగాళ్లు కఠినమైన సమయాలను ఎదుర్కుంటున్నప్పుడు ఫ్యామిలీ సమతుల్యత, సాధారణ స్థితిని తెస్తుంది. ఏ ఆటగాడు ఒంటరిగా కూర్చుని బాధపడటానికి ఇష్టపడడు. ఈ సమయంలో కుటుంబాలు దూరంగా ఉంటే ఎంత నిరాశగా ఉంటుందో చెప్పలేము.' అని కోహ్లీ చెప్పారు. పర్యటనలలో ఆటగాళ్ల కుటుంబ సమయాన్ని పరిమితం చేస్తూ BCCI ఆదేశాలిచ్చిన సంగతి తెలిసిందే.