దేశ క్రీడారంగానికి భారీ శుభవార్త వినిపించే అవకాశం కనిపిస్తోంది. దాదాపు రెండు దశాబ్దాల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత దేశం మరో ప్రతిష్టాత్మక క్రీడాటోర్నీ ఆతిథ్యానికి సిద్ధం కాబోతుంది. 2030 కామన్వెల్త్ గేమ్స్ ఆతిథ్య నగర పోటీలో అహ్మదాబాద్ ముందంజలో నిలిచింది. ఈ మేరకు 2030లో జరిగే వందేండ్ల కామన్వెల్త్ గేమ్స్‌కు ఆతిథ్య నగరంగా అహ్మదాబాద్‌ను సిఫారసు చేస్తూ స్పోర్ట్స్ ఎగ్జిక్యూటివ్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ తీర్మానాన్ని పూర్తి స్థాయి సభ్యదేశాలకు పంపిన తర్వాత నవంబర్ 26న గ్లాస్గోలో జరిగే జనరల్ అసెంబ్లీలో తుది నిర్ణయం తీసుకోనున్నారు. కామన్వెల్త్ గేమ్స్ ఆతిథ్య హక్కుల కోసం అబుజా(నైజీరియా) పోటీపడుతున్నా..మెజార్టీ సభ్యులు అహ్మదాబాద్ వైపే మొగ్గుచూపారు. ఒకవేళ భారత్‌కు ఆతిథ్య హోదా దక్కితే 2036 ఒలింపిక్స్ నిర్వహణలో మరో కీలక అడుగు పడినట్లు అవుతుంది.
అబుజాతో అహ్మదాబాద్ పోటీ
2030 నాటికి సరిగ్గా వందేండ్లు పూర్తి చేసుకోబోతున్న కామన్వెల్త్ గేమ్స్ కోసం భారత్‌లోని అహ్మదాబాద్‌తో పాటు నైజీరియాలోని అబుజా నగరం పోటీపడతున్నది. అయితే ఓవైపు అబుజా ఆతిథ్య పోటీని సమర్థిస్తూనే ఎగ్జిక్యూటివ్ బోర్డు అహ్మదాబాద్ వైపు మొగ్గుచూపింది. 2034గేమ్స్‌కు ఆతిథ్యమిచ్చేందుకు ఆ దేశానికి మద్దతుగా ప్రణాళికలు రూపొందించాలని నిర్ణయించింది. ఆఫ్రికాలో కామన్వెల్త్ నిర్వహించాలన్న తమ నిబద్దతకు ఇది నిదర్శనమని పేర్కొంది.
పీటీ ఉష హర్షం
కామన్వెల్త్ గేమ్స్ మెజార్టీ సభ్య దేశాలు భారత్ వైపే మొగ్గు చూపడంపై పీటీ ఉష హర్షం వ్యక్తం చేశారు. ‘భారత్‌తో పాటు నైజీరియా ప్రతిపాదనలు స్ఫూర్తిదాయకంగా ఉన్నాయి. అన్ని అంశాలను పరిశీలించిన తర్వాత అబుజా కంటే అహ్మదాబాద్‌కే సభ్యులు మొగ్గుచూపారు’ అని కామన్వెల్త్ స్పోర్ట్స్ తాత్కాలిక అధ్యక్షుడు డొనాల్డ్ పేర్కొన్నాడు. ఇదిలా ఉంటే వందేండ్ల కామన్వెల్త్గేమ్స్కు ఆతిథ్యమివ్వడం భారత్‌కు దక్కిన గొప్ప గౌరమని జాతీయ ఒలింపిక్ అసోసియేషన్(ఐవోఏ) అధ్యక్షురాలు పీటీ ఉష హర్షం వ్యక్తం చేసింది. కామన్వెల్త్ ఆతిథ్యం ద్వారా భారత క్రీడా సత్తా ఏంటో ప్రపంచానికి చాటిచెప్పవచ్చని పేర్కొంది. దేశంలోని మౌలిక క్రీడా వసతుల కల్పనకు కామన్వెల్త్ గేమ్స్ దోహదం చేస్తాయని తెలిపింది.
ఒలింపిక్సే లక్ష్యంగా..
కామన్వెల్త్ క్రీడల నిర్వహణ కోసం దేశాలు ఆసక్తినీ ప్రదర్శించట్లేదు. 2022 సీడబ్ల్యూజీ క్రీడలకు డర్బన్ (దక్షిణాఫ్రికా) ఆతిథ్యమివ్వాల్సింది. నిర్వహణ వ్యయాన్ని భరించలేక ఆ నగరం వైదొలగడంతో బర్మింగ్‌హామ్ (ఇంగ్లాండ్) ఆతిథ్యమిచ్చింది. 2026 క్రీడలు నిజానికి ఆస్ట్రేలియాలోని విక్టోరియాలో జరగాల్సింది. కానీ ఖర్చు ఎక్కువవుతుందన్న ఉద్దేశంతో వాళ్లూ ఆతిథ్య హక్కులను వదులుకున్నారు. దీంతో గ్లాస్గో ముందుకొచ్చింది. . ఇలాంటి పరిస్థితుల్లోనూ క్రీడల నిర్వహణకు భారత్ ఆసక్తిని ప్రదర్శించడానికి కారణం 2036 ఒలింపిక్సే. విశ్వక్రీడలకు ఆతిథ్యమివ్వాలన్న కలను నెరవేర్చుకోవాలనుకుంటున్న భారత్.. ఈ లోపు కామన్వెల్త్ గేమ్స్‌ను విజయవంతంగా నిర్వహించి సత్తా చాటాలనుకుంటోంది.