CPL: ఇక క్రికెట్‌లోనూ రెడ్‌ కార్ట్‌

కరేబియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో ప్రయోగాత్మకంగా అమలు... స్లో ఓవర్‌ రేట్‌ తగ్గించుకునేందుకు అన్న నిర్వాహకులు....;

Update: 2023-08-14 03:15 GMT

రెడ్‌కార్డ్‌... మాములుగా ఫుట్‌బాల్‌, హాకీలో కనిపిస్తుంటుంది. ఆటగాడు నిబంధనలు అతిక్రమించినా, దూకుడుగా వ్యవహరించినా.. ప్రత్యర్థి ఆటగాడిని ఉద్దేశపూర్వకంగా గాయపరిచినా ఈ రెడ్‌ కార్డ్‌ చూపిస్తారు. ఇప్పుడు ఈ రెడ్‌ కార్డ్‌ క్రికెట్‌లోకి ప్రవేశించనుంది. కరీబియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(Caribbean Premier League)లో దీన్ని ప్రవేశపెట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. వెస్టిండీస్‌ క్రికెట్‌ బోర్డు(West Indies Cricket Board) కరీబియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (CPL 2023) ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టాలని చూస్తోంది.

నిర్ణీత సమయంలో మ్యాచ్‌లు జరిగేందుకు ఈ నిబంధన ఉపయోగపడుతుందని పలువురు మాజీలు కూడా అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం స్లో ఓవర్‌ రేట్‌(Slow Over Rate)ను నియంత్రించేందుకు ఐసీసీ కొన్ని నిబంధనలు పాటిస్తోంది. టీ20ల్లో నిర్ణీత సమయంలో ఓవర్లు ముగించకపోతే.. చివరి ఓవర్‌లో 30 యార్డ్స్‌ సర్కిల్‌ బయట ఒక ఫీల్డర్‌ను తగ్గించాల్సి ఉంటుంది. దీంతో పాటు జరిమానాలు, డీ మెరిట్‌ పాయింట్ల వంటివి ఉండనే ఉన్నాయి. అయితే ఇప్పుడు CCLలో మరో అడుగు ముందుకు వేసి రెడ్‌ కార్డ్‌ నిబంధన తీసుకురావాలని చూస్తోంది.


CCLలో మ్యాచ్‌లు నిర్ణీత సమయంలో పూర్తి కావడం లేదని, అందుకే రెడ్‌ కార్డ్‌ రూల్‌ తేవడం వల్లనైనా స్లో ఓవర్‌ రేటు తగ్గుతుందని ఆశిస్తున్నామని కరీబియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ ఆపరేషన్స్‌ డైరెక్టర్‌ మైకేల్‌ హాల్‌(Michael Hall) తెలిపాడు. రెడ్‌ కార్డు రూల్‌ ప్రకారం 17వ ఓవర్‌ షెడ్యూల్‌ సమయానికి పూర్తి కాకపోతే మిగిలిన 2 ఓవర్లలో ఓ ఫీల్డర్‌ 30 యార్డ్స్‌ సర్కిల్‌లో మొహరించాల్సి ఉంటుంది. చివరి ఓవర్‌లో ఓ ప్లేయర్‌ను రెడ్‌ కార్డు ద్వారా మైదానం బయటకు పంపుతారు. ఎవరిని బయటకు పంపాలనే నిర్ణయం కెప్టెన్‌ తీసుకుంటాడు. ఒకవేళ బ్యాటర్లు సమయం వృథా చేస్తే దాన్ని కూడా పరిగణనలోకి తీసుకొని అంపైర్లు రెండుసార్లు హెచ్చరిస్తారు. అయినా తీరు మారకపోతే 5 పరుగులను పెనాల్టీ కింద కట్‌ చేస్తారు. ఈ నిబంధనల్లో 20 ఓవర్ల ఇన్నింగ్స్‌కు 85 నిమిషాలు కేటాయించారు. అంటే సరాసరిన 4 నిమిషాల 15 సెకన్లలో ఒక ఓవర్‌ పూర్తి చేయాల్సి ఉంటుంది. ఈ విధానం విజయవంతం అయితే దానిని మరింత విస్తరించే అవకాశం ఉంది. స్లో ఓవర్‌ రేట్‌ కారణంగా ప్రేక్షకుల్లో అసహనం పెరుగుతుందని నిర్వాహకులు అభిప్రాయపడుతున్నారు. ఎన్నిసార్లు హెచ్చరించినా జట్ల తీరు మారడం లేదన్న విమర్శలు కూడా ఉన్నాయి.

Tags:    

Similar News