CRICET: సంక్షోభంలో భారత క్రికెట్...!

రోహిత్-కోహ్లీ రిటైర్మెంట్‌తో అయోమయం;

Update: 2025-05-16 01:00 GMT

టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్ అయిన తర్వాత భారత క్రికెట్‌లో ఒక శకం ముగిసింది. ఇప్పుడు ఈ ఇద్దరు బ్యాట్స్‌మెన్‌లు వన్డే క్రికెట్ మాత్రమే ఆడతారు. భారత క్రికెట్ చరిత్రలో రెండు దిగ్గజ పేర్లు - రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ. ఆధునిక క్రికెట్‌లో టీమిండియాకు రెండు కళ్లుగా మారిన ఈ ఇద్దరూ అంతర్జాతీయ క్రికెట్‌లోని మూడు ఫార్మాట్లలో రెండింటి నుంచి వీడ్కోలు పలికారు. టి20, టెస్ట్ క్రికెట్ నుంచి వారు తప్పుకోవడంతో భారత క్రికెట్‌లో ఒక శకం ముగిసింది. ఈ ఇద్దరూ కలిసి టి20, టెస్టుల్లో ఏకంగా 21,950 పరుగులు చేశారు.

టెస్టులను నడిపించేదెవరో..?

రో-కో సుదీర్ఘ ఫార్మట్ నుంచి వైదొలగడంతో ఇప్పుడు టీమిండియా టెస్టు క్రికెట్ సంక్షోభంలో చిక్కుకుంటున్నట్లు కనిపిస్తోంది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ రోజుల వ్యవధిలో టెస్టు క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించడంతో టీమిండియా సందిగ్ధంలో పడింది. ప్రస్తుతం భారత టెస్ట్ జట్టు తదుపరి కెప్టెన్ ఎవరనేది పెద్ద చర్చగా మారింది. రోహిత్ శర్మ టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత టీమిండియాలో కెప్టెన్సీ విషయంలో కొత్త చర్చ మొదలైంది. శుభ్‌మన్ గిల్‌ను భవిష్యత్ టెస్ట్ కెప్టెన్‌గా భావిస్తున్నారు. ఫాస్ట్ బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రా కూడా టెస్ట్ కెప్టెన్సీకి పోటీదారుడిగా ఉన్నా రేసులో కాస్త వెనుకబడినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో చాలా మంది క్రికెట్ నిపుణులు బీసీసీఐ ఎంపిక ప్రక్రియపై ప్రశ్నలు లేవనెత్తడం ప్రారంభించారు. రోహిత్ శర్మ స్థానంలో జస్‌ప్రీత్ బుమ్రా మంచి ఎంపిక అని రవిచంద్రన్ అశ్విన్, సునీల్ గవాస్కర్ విశ్వసిస్తున్నారు. తాజాగా మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ కూడా అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీపై ప్రశ్నలు లేవనెత్తారు. ఇప్పటికే రెండుసార్లు WTC ఫైనల్‌కు చేరిన టీమిండియా.. ఇటీవల న్యూజిలాండ్, ఆస్ట్రేలియాతో జరిగిన టెస్ట్ సిరీస్‌లలో ఓడి, కాస్త ఆత్మవిశ్వాసం కోల్పోయింది.

యువతరం ముందుకు తీసుకెళ్లగలదా..?

టీమిండియా ప్రమాదంలో పడనుందని మాత్రం మాజీ క్రికెటర్లు అంచనా వేస్తున్నారు. యంగ్ స్టార్స్ భారత్ ను ముందుకు తీసుకెళ్లగలరా అనేదానిపై చాలా ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. రెండు దశాబ్దాలుగా ఎదురులేని భారత్ ఒక్కసారిగా ప్రపంచ క్రికెట్ ముందు ఎందుకు బలహీనంగా కనిపిస్తుందన్న ప్రశ్నలు వస్తున్నాయి. కోహ్లీ, రోహిత్ దశాబ్దకాలం పాటు టెస్ట్ క్రికెట్ ను కాపాడుతూ వచ్చారు. టెస్టుల్లో కోహ్లీ నాయకత్వంలో భారత్ చాలా కాలం పాటు నంబర్ వన్ పొజిషన్లో కొనసాగింది. హిట్ మ్యాన్ కూడా అంచనాలను అందుకున్నాడు. అయితే రాబోయే యువ కెప్టెన్ ఆ వారసత్వాన్ని కొనసాగించగలడా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

ఇంగ్లండ్ గడ్డపై..

ఇంగ్లాండ్ పర్యటనకు ముందు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్ అయిన సంగతి తెలిసిందే. దీంతో యువ ఆటగాళ్ల నిండిన టీమిండియా ఇంగ్లాండ్ గడ్డపై ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ ఆడనుంది. ఇంగ్లాండ్‌తో జరగబోయే ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్.. కొత్త వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ సైకిల్‌కు నాంది పలకనుంది.ఈ నేపథ్యంలో ఇంగ్లాండ్ సిరీస్‌లో మంచి ప్రదర్శన చేయడం చాలా ముఖ్యం. కానీ రోహిత్, కోహ్లీ, రవిచంద్రన్ అశ్విన్.. ముగ్గురు కీలక ఆటగాళ్లు లేని లోటును టీమిండియా మేనేజ్‌మెంట్ భర్తీ చేయాల్సి ఉంది. ముఖ్యంగా ప్లేయింగ్ ఎలెవన్‌లో మూడు స్థానాలు ఖాళీ అయ్యాయి. రోహిత్ శర్మ వదిలి వెళ్లిన ఓపెనింగ్ స్లాట్, విరాట్ కోహ్లీ స్థానంలో కీలకమైన నెం. 4 స్థానం, రవిచంద్రన్ అశ్విన్ లేని ప్రధాన స్పిన్నర్ స్థానాలను ఎవరితో భర్తీ చేస్తారో చూడాలి. అశ్విన్ లేని లోటు పెద్దగా ప్రభావం చూపకపోవచ్చు. కానీ, రోహిత్, కోహ్లీల స్థానాలు మాత్రం తీర్చలేనివి.

Tags:    

Similar News