dhoni: యుద్ధ రంగంలోకి ధోనీ..?
లెఫ్ట్‌నెంట్ కల్నల్ హోదాలో టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ;
పాకిస్థాన్‌తో యుద్దం నేపథ్యంలో భారత సైన్యానికి సాయం అందించాలంటూ ప్రాదేశిక సైన్యానికి రక్షణ మంత్రిత్వ శాఖ పిలుపునిచ్చింది. ప్రాదేశిక సైన్యం సేవలను ఉపయోగించుకునేందుకు భారత సైనిక అధ్యక్షుడికి పూర్తి అధికారం ఉందని గెజిట్ నోటిఫికేషన్‌లో రక్షణశాఖ స్పష్టం చేసింది. సైన్యానికి అనుబంధంగా ఉంటూ ప్రాదేశిక సైన్యం చేయూత అందించనుంది. గతంలో కూడా సైన్యానికి ప్రాదేశిక సైనిక వర్గం సేవలు అందించింది. ఇప్పుడు కూడా సేవలు అందించబోతుంది. ఆపరేషన్ పరాక్రమ్, కార్గిల్ యుద్ద సమయంలోనూ ప్రాదేశిక సైన్యం.. భారత సైనిక దళానికి సేవలు అందించింది. ఈ ప్రాదేశిక సైన్యంలో చాలా మంది ప్రముఖులు ఉన్నారు. లెఫ్ట్‌నెంట్ కల్నల్ హోదాలో టీమిండియా మాజీ కెప్టెన్‌లు మహేంద్ర సింగ్ ధోనీ, కపిల్ దేవ్ ఉండగా.. సచిన్ పైలెట్ కూడా ప్రాదేశిక సైన్యంలో కెప్టెన్ హోదాలో కొనసాగుతున్నారు. ప్రాదేశిక సైన్యం అనేది స్వచ్ఛంద పౌరుల సైనిక సంస్థ, దేశానికి అవసరమైనప్పుడు సేవ చేయడానికి శిక్షణ పొందుతారు.
కశ్మీర్‌లోనూ విధులు నిర్వహించిన ధోనీ
మహేంద్ర సింగ్ ధోనీకి 2011లో భారత ప్రాదేశిక సైన్యం గౌరవ లెఫ్టినెంట్ కల్నల్ హోదాను ప్రదానం చేసింది. ఇది క్రికెట్‌కు చేసిన సేవలకు గుర్తింపుగా దక్కింది. ధోనీ పారాట్రూపర్ శిక్షణ కూడా తీసుకున్నాడు. ఆ ట్రైనింగ్‌లో అర్హత కూడా సాధించాడు. 2019 వన్డే ప్రపంచకప్ పరాజయం అనంతరం.. ధోనీ తన బెటాలియన్‌తో కలిసి కాశ్మీర్ లోయలో దాదాపు 15 రోజుల పాటు పెట్రోలింగ్, గార్డ్, పోస్ట్ డ్యూటీ వంటి విధుల్లో పాల్గొన్నాడు. ఇది అతని అభ్యర్థన మేరకు ఆర్మీ హెడ్‌క్వార్టర్స్ అనుమతి ఇచ్చింది.