CT2025: బంగ్లాపై టీమిండియా ఘన విజయం

శుభ్‌మన్‌ గిల్ సెంచరీ.. అయిదు వికెట్లతో సత్తా చాటిన షమీ;

Update: 2025-02-21 01:00 GMT

ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో భారత్ శుభారంభం చేసింది. బంగ్లాదేశ్‌ను చిత్తు చేస్తూ తొలి మ్యాచులో ఘన విజయం సాధించింది. దుబాయ్‌ వేదికగా జరిగిన మ్యాచులో తొలుత బాల్‌తో రాణించిన టీమిండియా.. ఆ తర్వాత బ్యాట్‌తోనూ రాణించి ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో ఓపెనర్ శుభ్‌మన్ గిల్ సెంచరీతో రాణించాడు. తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లా 49.4 ఓవర్లలో 228 పరుగులకు ఆలౌట్ అయ్యింది. బంగ్లా బ్యాటర్లలో తౌహిద్ హృదయ్ సెంచరీతో ఆ జట్టును ఆదుకున్నాడు. హృదయ్ 100, జాకర్ అలీ 68 పరుగులు చేశారు. భారత బౌలర్లలో మహ్మద్ షమీ ఐదు, హర్షిత్ రాణా మూడు వికెట్లు, అక్షర్ పటేల్ రెండు వికెట్లు తీశారు.అనంతరం 229 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ కు దిగిన భారత్ నాలుగు వికెట్లు కోల్పోయి 231 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. గిల్ అదిరిపోయే సెంచరీతో భారత్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. కెప్టెన్ రోహిత్ శర్మ(41), కేఎల్ రాహుల్(41) పరుగులతో రాణించారు.

ఆరంభంలో బంగ్లా తిప్పలు..

ఈ మ్యాచులో బంగ్లా బ్యాటర్లను ఆరంభంలో భారత బౌలర్లు తిప్పలు పెట్టారు. భారత బౌలర్ల ధాటికి 35 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన బంగ్లా తరువాత తేరుకుంది. బంగ్లా బ్యాటర్లు నిలకడగా ఆడారు. ముఖ్యంగా బంగ్లా బ్యాటర్ తోహిద్ హ్రిడోయ్ సూపర్ సెంచరీ చేయడంతో.. నిర్ణీత 49.4 ఓవర్లలో 10 వికెట్ల నష్టానికి 228 పరుగులు చేసింది.

నిరాశపరిచిన కింగ్ కోహ్లీ

బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి వన్డేలో కోహ్లీ విఫలమయ్యాడు. పేలవ ఫామ్‌లో ఉన్న కోహ్లీ.. ఈ మ్యాచులో ఫామ్‌లోకి వస్తాడని అభిమానులు ఆశించారు. కానీ కోహ్లీ 22 పరుగులే చేసి పెవిలియన్ కు చేరాడు. కోహ్లీ భారీ స్కోరు చేస్తాడని అంతా భావించినా అనూహ్యంగా అవుటయ్యాడు. దీంతో ఫ్యాన్స్ తీవ్రంగా నిరాశ పడ్డారు. పాకిస్థాన్ మ్యాచుకు ముందు కోహ్లీ ఇలా తక్కువ పరుగులకే అవుట్ కావడం అభిమానులను ఆందోళన పరుస్తోంది.

జ‌హీర్ ను అధిగ‌మించిన ష‌మీ..

బంగ్లాతో మ్యాచ్ లోనే వెట‌ర‌న్ పేస‌ర్ మ‌హమ్మద్ ష‌మీ 200 వికెట్ల క్ల‌బ్బులోకి చేరుకున్నాడు. ఈ మ్యాచ్ లో 53 ప‌రుగులిచ్చి ఐదు వికెట్లు తీసిన ష‌మీ స‌త్తా చాటాడు. దీంతో 104 వ‌న్డేల్లోనే 202 వికెట్లతో అద‌రగొట్టాడు. అత‌ని యావ‌ర‌రేజీ కేవలం 23.63 కావ‌డం విశేషం. అత్యుత్తమ ప్రద‌ర్శన 7-57 కాగా, ఆరు 5 వికెట్ల ప్రద‌ర్శన‌లు ఉన్నాయి. తాజా ఘ‌న‌త‌తో భార‌త్ త‌ర‌పున అత్యధిక వికెట్లు తీసిన ఎనిమిదో బౌల‌ర్ గా షమీ నిలిచాడు. ఇక ఐసీసీ టోర్నీలో అత్యధిక వికెట్లు తీసిన జ‌హీర్ ఖాన్ (59 వికెట్లు)ను ష‌మీ అధిగ‌మించాడు. తాజాగా ఐదు వికెట్లు తీయ‌డంతో 60 వికెట్ల‌తో జ‌హీర్ ను దాటేశాడు.

Tags:    

Similar News