టీమిండియా స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రాపై ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ ప్రశంసలు కురిపించాడు. తాను ఎదుర్కొన్న అత్యంత కఠినమైన బౌలర్ బుమ్రానే అని పేర్కొన్నాడు. బ్యాటర్లను ఇబ్బందిపెట్టడానికి బుమ్రా వద్ద ఎన్నో అస్త్రాలు ఉంటాయని వివరించాడు. ‘నేను ఎదుర్కొన్న అత్యంత కఠినమైన బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రా. అతను ప్రపంచంలోనే అన్ని ఫార్మాట్లలో ఆల్‌టైమ్ బెస్ట్ బౌలర్‌గా ఎదుగుతున్నాడు. అతను బంతిని వదిలే స్థానం భిన్నంగా ఉంటుంది. చివరి నిమిషంలో బంతి గమ్యాన్ని మార్చగలడు. ఎవరూ ఊహించనివిధంగా స్లో బాల్‌ను వేయగలడు. అద్భుతమైన యార్కర్‌ను సంధించగలడు. బంతిని రెండు వైపులా స్వింగ్ చేయగల సామర్థ్యం అతని సొంతం. బుమ్రాకు అద్భుతమైన మణికట్టు ఉంది. మంచి ఫాస్ట్ బౌలర్ వద్ద ఉండాల్సిన అన్ని అస్త్రాలు అతని దగ్గర ఉన్నాయి’ అని మ్యాక్స్‌వెల్ పేర్కొన్నాడు. బుమ్రా ప్రస్తుతం ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో నంబర్‌వన్‌గా ఉన్నాడు. వైవిధ్యమైన షాట్లు ఆడే మ్యాక్స్‌వెల్‌పై బుమ్రా ఆధిపత్యం కొనసాగిస్తున్నాడు. ఇప్పటివరకు వీరిద్దరూ 15 ఇన్నింగ్స్‌ల్లో తలపడ్డారు. ఇందులో ఏడుసార్లు మ్యాక్సీని బుమ్రా ఔట్ చేశాడు. నవంబర్ 22 నుంచి బోర్డర్-గావస్కర్ ట్రోఫీ ప్రారంభం కానుంది. ఇది భారత్‌కు ఎంతో కీలకమైన సిరీస్.