టీమిండియా కోచ్ గౌతమ్ గంభీర్ చిన్న విషయానికే చిరాకుపడతాడని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ అన్నాడు. విరాట్ కోహ్లిపై తన వ్యాఖ్యలను విమర్శగా చూడొద్దని, తన పేలవ ఫామ్‌పై స్వయంగా కోహ్లినే కలవరపడుతూ ఉండొచ్చని చెప్పాడు. టెస్టుల్లో కోహ్లి ఫామ్ ఆంందోళన కలిగిస్తోందని, గత అయిదేళ్లలో రెండు శతకాలు చేశాడని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాంటింగ్ అన్నాడు. ఈ ఫామ్‌తో మరే ఇతర ఆటగాడికైనా జట్టులో స్థానం నిలబెట్టుకోవడం కష్టమయ్యేదని చెప్పాడు. కోహ్లి పుంజుకోగలడని కూడా అన్నాడు. అయితే పాంటింగ్ వ్యాఖ్యలపై గంభీర్ మండిపడ్డాడు. భారత క్రికెట్ గురించి అతడికెందుకని అన్నాడు. ఈ నేపథ్యంలో పాంటింగ్ స్పందిస్తూ.. ‘గంభీర్ స్పందన ఆశ్చర్యం కలిగించింది. అతడు ఊరికే చిరాకు పడుతుంటాడు. మా ఇద్దరికీ కాస్త పడదు. నేను దిల్లీ క్యాపిటల్స్ కోచ్‌గా ఉన్నప్పుడు అతడు ఆ జట్టులో ఉన్నాడు’ అని చెప్పాడు.