Ind vs Wi: భారత ఆటగాళ్ల విజృంభణ, సిరీస్ వశం
వన్డే సిరీస్‌ని గెలిచింది. ఆగస్ట్ 3 నుంచి 5 మ్యాచుల టీ20 సిరీస్ ఆరంభమవనుంది.;
విండీస్‌తో చివరి వన్డేలో భారత యువజట్టు ఆతిథ్య జట్టను చిత్తు చేసింది. 200 పరుగుల భారీ తేడాతో విండీస్‌ని ఓడించి 2-1 తేడాతో సిరీస్‌ని గెలుచుకుంది. 2వ వన్డేలో విఫలమైన భారత బ్యాట్స్‌మెన్ ఈ మ్యాచ్‌తో గాడిలో పడ్డారు. నలుగురు భారత ఆటగాళ్లు ఇషాన్ కిషన్, శుభ్ మన్ గిల్, హార్ధిక్ పాండ్యా, సంజూ శాంసన్‌లు అర్ధసెంచరీలతో రాణించారు. విండీస్ జట్టు 151 పరుగులకు ఆలౌటయింది. వరుసగా 2వ మ్యాచ్‌లోనూ సీనియర్ ఆటగాళ్లు రోహిత్, కోహ్లీలకు విశ్రాంతినిచ్చి యువజట్టుతోనే బరిలోకి దింపారు. గత మ్యాచ్‌లో తడబడ్డా ఈ మ్యాచులో పుంజుకుని సిరీస్ చేజిక్కించుకున్నారు.
352 పరుగుల భారీ లక్ష్య ఛేదనతో బరిలో దిగిన విండీస్ జట్టు ఏ దశలోనూ లక్ష్యం దిశగా సాగలేదు. ఆరంభంలోనే భారత పేసర్ ముఖేష్ విండీస్‌ని దెబ్బకొట్టాడు. మొదటి ఓవర్లోనే తొలి వికెట్ తీయడంతో పాటు, 3, 7వ ఓవర్లలోనూ వికెట్లు తీసి సత్తా చాటాడు. శార్ధూల్ ఠాకూర్, ఉనద్కత్‌లు తర్వాత వచ్చిన బ్యాట్స్‌మెన్ల పని పట్టారు. 9వ స్థానంలో వచ్చిన మోతీ చేసిన 39 పరుగులే విండీస్ జట్టు బ్యాట్స్‌మెన్ అత్యధికం. చివరకు 35.3 ఓవర్లలో 151 పరుగులకు చాపచుట్టేసింది. భారత బౌలర్లలో శార్ధూల్ 4 వికెట్లు తీయగా, ముఖేష్ కుమార్ 3 వికెట్లు, కుల్దీప్ యాదవ్ 2, ఉనద్కత్ 1 వికెట్ తీశారు.
అంతకుముందు మొదటి ఇన్నింగ్స్ ఆరంభించిన భారత్‌కు ఓపెనర్లు గిల్, ఇషాన్ కిషన్‌లు చెలరేగి ఆడి భారీ స్కోర్‌కు బాటలు వేశారు. వీరిద్దరి ధాటికి 13.2 ఓవర్లలోనే భారత్ 100 పరుగులు దాటింది. దాంతో పాటే కిషన్ కూడా 42 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఓ బౌండరీ ద్వారా గిల్ కూడా 51 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తిచేసుకున్నాడు. వేగాన్ని కొనసాగించే క్రమంలో క్రీజు వదిలి వచ్చిన కిషన్ స్టంపౌట్‌గా వెనుదిరిగాడు. మొదటి వికెట్‌కి వీరిద్దరూ 143 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశారు. క్రీజులోకి వచ్చిన రుతురాజ్ 8 పరుగులకే ఔటయ్యాడు.
క్రీజులోకి వచ్చిన సంజూ శాంసన్ తనకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. వేగంగా ఆడుతూ 39 బంతుల్లోనే అర్ధసెంచరీ చేశాడు. మరో రెండు బంతుల్లోనే ఔటై వెనుదిరిగాడు. నిలకడగా ఆడుతున్న గిల్ సెంచరీకి 15 పరుగుల దూరంలో 4వ వికెట్‌గా వెనుదిరిగాడు. సూర్యకుమార్ బౌండరీలతో మెరిపించాడు. కానీ కారియా పట్టిన అద్భుత క్యాచ్‌కి పెవిలియన్ బాట పట్టాడు. చివర్లో కెప్టెన్ హార్ధిక్ పాండ్యా సిక్సులు, ఫోర్లతో విండీస్ బౌలర్లపై విరుచుపడడంతో భారత్ 50 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 351 పరుగులు చేసింది. విండీస్ బౌలర్లలో షెపర్డ్ 2 వికెట్లు, జోసెఫ్, మోతీ, కారియాలు చెరో వికెట్ తీశారు.