Asian Table Tennis Championship: భారత్‌కు పతకం ఖాయం
సెమీఫైనల్లోకి దూసుకెళ్లిన భారత పురుషుల జట్టు.. మహిళల జట్టు పరాజయం..;
ఆసియా టేబుల్ టెన్నిస్ ఛాంపియన్‌షిప్‌లో భారత పురుషుల జట్టు సత్తా చాటింది. దక్షిణ కొరియాలో జరుగుతున్న ఈ టోర్నీలో శరత్ కమల్, జ్ఞానేశ్వరన్ సత్యన్, హర్మీత్ దేశాయ్‌లతో కూడిన భారత జట్టు సెమీస్‌కు అర్హత సాధించింది. అద్భుత ఆటతీరుతో సెమీఫైనల్‌కు దూసుకెళ్లి కనీసం కాంస్య పతకం ఖాయం చేసుకుంది. సోమవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో భారత జట్టు 3–0తో సింగపూర్ జట్టును ఓడించింది. తొలి సింగిల్స్‌లో 41 ఏళ్ల ఆచంట శరత్ కమల్ 11-1, 10-12, 11-8, 11-13, 14-12తో ఐజాక్ క్వెక్‌పై గెలిచి భారత్ ఖాతా తెరిచాడు. రెండో సింగిల్స్‌లో సత్యన్ 11-6, 11-8, 12-10తో కొయెన్ పాంగ్‌ను చిత్తుచేసి భారత్‌కు 2-0తో ఆధిక్యాన్ని అందించాడు. మూడో మ్యాచ్‌లో హర్మీత్ దేశాయ్ 11-9, 11-4, 11-6తో క్లారెన్స్ చ్యూపై నెగ్గి 3-0తో భారత్‌కు విజయాన్ని అందించాడు. వరుసగా మూడు గేమ్‌లను గెలుచుకున్న భారత్.. మరో రెండు గేమ్‌లు మిగిలి ఉండగానే మ్యాచ్‌ను సొంతం చేసుకుంది. ఈ విజయంతో భారత్ సెమీస్‌లో అడుగుపెట్టడంతో కనీసం కాంస్య పతకం ఖరారైంది.
సెమీస్‌లో ఇరాన్ లేదా చైనీస్ తైపీతో భారత్ తలపడుతుంది. క్షిణ కొరియాతో చైనా తలపడతాయి. ఆసియా ఛాంపియన్‌షిప్‌లో సెమీస్‌లో భారత్ ఓడినా కాంస్య పతకం లభిస్తుంది. రెండేళ్ల క్రితం దోహాలో జరిగిన ఆసియా టోర్నీలో భారత్ కాంస్య పతకం సాధించింది.
భారత మహిళల జట్టు క్వార్టర్ ఫైనల్లో 0–3తో జపాన్ చేతిలో ఓడిపోయింది. ఐహిక ముఖర్జీ 7-11, 13-15, 8-11తో మిమా ఇటో చేతిలో, మనిక బాత్రా 7-11, 9-11, 11-9, 3-11తో హినా హయతా చేతిలో, సుతీర్థ ముఖర్జీ 11-7, 4-11, 6-11, 5-11తో మియు హిరానో చేతిలో ఓడారు.