Prithvi Shaw: పాపం.. పృథ్వీ షా
భీకర ఫామ్‌లో ఉన్న సమయంలో పృథ్వీకి గాయం... లండన్ వన్డే కప్ నుంచి అర్ధాంతరంగా వైదొలిగిన యువ బ్యాటర్;
ఇంగ్లండ్ రాయల్ లండన్ వన్డే కప్(One-Day Cup tournament in England )లో భీకర ఫామ్‌తో విధ్వంసం సృష్టిస్తున్న టీమిండియా యువ బ్యాటర్ పృథ్వీ షా (Prithvi Shaw)కు గట్టి షాక్ తగిలింది. ఇప్పటికే ఓ డబుల్ సెంచరీతో సెంచరీ బాది అద్భుతమైన ఫామ్‌లో ఉన్న పృథ్వీ షా గాయం కారణంగా టోర్నీ నుంచి అర్ధాంతరంగా వైదొలిగాడు. మోకాలి గాయం కారణంగా టోర్నీ మొత్తానికి దూరమయ్యాడు. ఈ విషయాన్ని పృథ్వీ షా ప్రాతినిధ్యం వహిస్తున్న నార్తంప్టన్‌షైర్ జట్టు(Northamptonshire) అధికారికంగా ప్రకటించింది. డర్హమ్‌తో మ్యాచ్‌లో ఫీల్డింగ్ చేస్తుండగా షా గాయపడ్డాడని(injured his knee while fielding ), స్కానింగ్ రిపోర్టుల్లో గాయం ఊహించినదాని కంటే పెద్దదని తేలిందని నార్తంప్టన్ షైర్ తెలిపింది. దీంతో తదుపరి మ్యాచ్‌లకు షా దూరంగా ఉండనున్నట్లు తెలిపింది. షా తక్కువ కాలంలోనే తమ జట్టులో కీలక ఆటగాడిగా మారాడని, అతను జట్టును వీడడం బాధాకరం అని నార్తంప్టన్‌షైర్ కోచ్ జాన్ సాడ్లర్ ట్వీట్ చేశాడు. పృథ్వీ షా త్వరగా కోలుకుని మరిన్ని పరుగులు సాధించాలని కోరుకుంటున్నట్లు చెప్పుకొచ్చాడు. పృథ్వీ షాను లండన్‌లో బీసీసీఐ ఆధ్వర్యంలోని స్పెషలిస్ట్ డాక్టర్ శుక్రవారం కలుస్తారు.
నార్తంప్టన్‌షైర్ తరఫున ఆడిన మూడో మ్యాచ్‌లోనే పృథ్వీషా సంచలన ఇన్నింగ్స్‌తో డబుల్ సెంచరీ నమోదు చేశాడు. సోమర్‌సెట్‌తో జరిగిన మ్యాచ్‌లో పృథ్వీ షా (244; 153 బంతుల్లో 28 ఫోర్లు, 11 సిక్స్‌లు) బాదేశాడు. తర్వాత డర్హామ్‌పై 76 బంతుల్లోనే 125 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. మొదటి రెండు మ్యాచ్‌ల్లో కలిపి 60 పరుగులే చేశాడు. కానీ ఆగష్టు 9న సోమర్‌సెట్‌తో జరిగిన మ్యాచ్‌లో 23 ఏళ్ల పృథ్వీ షా విశ్వరూపం చూపించాడు. ఏకంగా డబుల్ సెంచరీ బాదేశాడు. 28 ఫోర్లు, 11 సిక్సులతో 153 బంతుల్లోనే 244 పరుగులు చేశాడు. ఇక ఆ తర్వాత ఆగష్టు 13న డర్హమ్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ చెలరేగాడు. 15 ఫోర్లు, 7 సిక్సులతో 76 బంతుల్లోనే 125 పరుగులు చేశాడు. ఇప్పటివరకు ఆడిన 4 మ్యాచ్‌లోనే 429 పరుగులు చేసిన పృథ్వీ షా టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా ఉన్నాడు .
భారత జట్టులో చోటు సంపాదించడమే లక్ష్యంగా పృథ్వీ షా కౌంటీలు ఆడుతున్నాడు. తన గురించి సెలెక్టర్లు ఏమనుకుంటున్నారో ఇప్పుడే ఆలోచించబోనని.. కౌంటీల్లో రాణించడంపైనే దృష్టి పెడుతున్నానని తెలిపారు. మంచి ఫామ్‌లో ఉండి రాణిస్తున్న వేళ ఇలా గాయపడడం... జాతీయ జట్టులోకి రావాలన్న షా ఆశలకు పెద్ద అవరోధంగా మారనుంది.