IPL 2024 Final : ఐపీఎల్ ఫైనల్లోకి హైదరాబాద్.. రేపు కోల్‌కతాతో టైటిల్ ఫైట్
ఐపీఎల్ 2024లో భాగంగా చెన్నై చెపాక్ స్టేడియం వేదికగా శుక్రవారం జరిగిన కీలక క్వాలిఫయర్-2 మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్ అదరగొట్టింది. తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 175 పరుగులు చేసింది. క్లాసెన్ అర్థశతకం చేయగా, త్రిపాఠి, హెడ్ దూకుడుగా ఆడారు.
అనంతరం బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ హైదరాబాద్ బౌలర్ల దెబ్బకు 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 139 పరుగులకే కుప్పకూలింది. ధ్రువ్ జురెల్ అర్ధశతకం చేయగా, యశస్వి జైస్వాల్ మెరుపులు మెరిపించాడు. కీలక సమయంలో హైదరాబాద్ బౌలర్లు షాబాజ్ అహ్మద్, అభిషేక్ శర్మ చెలరేగడంతో రాజస్థాన్ ఓటమిని చవిచూసింది. రాజస్థాన్ ను 36 పరుగుల తేడాతో ఓడించి ఫైనల్ కు దూసుకెళ్లింది.
ఆదివారం ఇదే చెన్నైలోని చెపాక్ స్టేడియంలో కోల్కతా- హైదరాబాద్ మధ్య తుదిసమరం జరగనుంది.