IPL: విదేశీ ఆటగాళ్ల రాకపై ఉత్కంఠ
ఐపీఎల్ వాయిదాతో మారిన సమీకరణాలు.. ఇప్పటికే స్వదేశాలకు విదేశీ క్రికెటర్లు;
ఐపీఎల్ 2025 చిన్న బ్రేక్ తర్వాత మళ్లీ ప్రేక్షకులకు ఫుల్ మజా అందించేందుకు రెడీ అవుతోంది. ఈ టోర్నమెంట్ మే 17న రీస్టార్ట్ కానుంది. జూన్ 3న ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ప్లే ఆఫ్స్ సహా మిగిలిన 17 మ్యాచ్‌లను ఆరు వేదికల్లో నిర్వహించేందుకు బీసీసీఐ ప్లాన్ చేసింది. ఈ నేపథ్యంలో ఆటగాళ్లంతా మళ్లీ ప్రాక్టీస్ షురూ చేశారు. భారత్, పాకిస్థాన్ మధ్య సరిహద్దుల్లో కాల్పుల విరమణ అమల్లోకి రావడంతో ఇండియన్ ప్రీమియర్ లీగ్ నిర్వహణకు బీసీసీఐ సిద్ధమైంది. ఇప్పుడు మెగా లీగ్‌లో జరగాల్సిన తర్వాతి మ్యాచ్‌లపై క్రికెట్ ప్రేమికుల దృష్టీ నిలిచింది. ఆరు నగరాలు బెంగళూరు, ముంబై, లక్నో, అహ్మదాబాద్, ఢిల్లీ, జైపూర్‌లలో మిగిలిన 13 లీగ్ మ్యాచ్‌లు నిర్వహించేందుకు సిద్ధమైన గవర్నింగ్ కౌన్సిల్... ‘ప్లే ఆఫ్స్’ మ్యాచ్‌ల వేదికలను ఇంకా ప్రకటించలేదు. అయితే ఇప్పుడు మ్యాచ్‌ల వేదికలకంటే ఆయా జట్లకు ఎవరెవరు ఆటగాళ్లు అందుబాటులో ఉంటారనే విషయంపైనే ఉత్కంఠ నెలకొంది. సీజన్ చివరి దశకు చేరుకుంటున్న సమయంలో విదేశీ ఆటగాళ్ల లభ్యత... ప్రాంఛైజీలకు కీలక సమస్యగా మారింది. మే 9న లీగ్‌ను తాత్కాలికంగా వాయిదా వేయడంతో విదేశీ ఆటగాళ్లు చాలామంది తమ సొంత దేశాలకు తిరిగి వెళ్లిపోయారు. దీంతో ప్లేఆఫ్ దశకు చేరిన పలు ఫ్రాంచైజీలకు తమ ముఖ్య ఆటగాళ్లను కోల్పోయే ప్రమాదం పొంచి ఉంది. ఈ నేపథ్యంలో బీసీసీఐ విదేశీ ఆటగాళ్లను తిరిగి భారత్‌కి రప్పించేందుకు శతవిధాలా ప్రయత్నిస్తోంది. చేస్తోంది. ఐపీఎల్ సీఈఓ హేమాంగ్ స్వయంగా ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డులతో నేరుగా మాట్లాడుతున్నారు. ఫ్రాంచైజీలు తమ ఆటగాళ్లతో సంప్రదింపులు జరుపుతున్నాయి. ఆటగాళ్ల రాకపై నిర్ణయం తీసుకోబోమని, ఇది అటుగాళ్ల వ్యక్తిగత నిర్ణయమే అని ఆసీస్ బోర్డు ఇప్పటికే స్పష్టం చేసింది.
ఎన్ఓసీలు కష్టమేనా.. ?
యుద్ధ పరిస్థితుల కారణంగా టోర్నీ వాయిదా పడకుండా ఉంటే మే 25న జరిగే ఫైనల్ మ్యాచ్‌తో ఐపీఎల్ ముగియాల్సి ఉంది. ఇప్పుడు కొత్త షెడ్యూల్ ప్రకారం జూన్ 3 వరకు టోర్నీ పొడిగించాల్సి వచ్చింది. విదేశీ ఆటగాళ్లందరూ మే ౨౫ ప్రకారమే సిద్ధమై లీగ్ కోసం తమ ప్రణాళికలకు రూపొందించుకున్నారు. ఆ తేదీ తర్వాత ఆయా జాతీయ జట్ల సిరీస్‌లు, ఇతర ఒప్పందాల ప్రకారం వారు ఐపీఎల్‌లో కొనసాగే అవకాశం లేదు. ఐపీఎల్ తేదీల ప్రకారమే తాము ఎన్‌ఓసీలు జారీ చేశామని, దీనిపై మళ్లీ చర్చించిన తర్వాత తమ నిర్ణయం ప్రకటిస్తామని ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు స్పష్టం చేసింది. న్యూజిలాండ్ బోర్డు కూడా దాదాపు ఇదే తరహాలో స్పందించింది. మరో వైపు ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు ఆటగాళ్ల ఇష్టానికి వదిలేసింది. వారి వ్యక్తిగతంగా నిర్ణయం తీసుకునేందుకు అవకాశం కల్పించింది. ముఖ్యంగా ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్ ఆటగాళ్లలో చాలా మంది ఐపీఎల్‌కు తిరిగి రావడంపై అనాసక్తిగానే ఉన్నారని తెలుస్తోంది. ఒకవేళ వచ్చినా గ్రూప్ స్టేజ్ ముగియకముందే టోర్నీకి గుడ్‌బై చెప్పనున్నట్టు తెలుస్తోంది. ఈ నిర్ణయంతో ప్లేఆఫ్స్ రేసులో ఉన్న టాప్-5 జట్ల గుజరాత్, బెంగళూరు, పంజాబ్, ముంబై, ఢిల్లీకు నష్టం తప్పకపోవచ్చునన్న ఆందోళనలో ఆయా ఫ్రాంచైజీలు ఉన్నాయి.
ఆర్సీబీపైనే ఎక్కువ ప్రభావం
డబ్ల్యూటీసీతో ఆర్సీబీపైనే అన్ని జట్ల కంటే ఎక్కువ ఎఫెక్ట్ పడనుంది. దాదాపు నలుగురు స్టార్ ప్లేయర్లు ప్లే ఆఫ్స్‌కు దూరం కానున్నారు. ఇది ఆర్సీబీపై తీవ్ర ప్రభావం చూపే ఛాన్స్ ఉంది. డబ్ల్యూటీసీ ఫైనల్ కారణంగా లుంగి ఎంగ్డి, జోష్ హేజిల్‌వుడ్, ఇంగ్లాండ్- వెస్టిండీస్ సిరీస్ వల్ల జకాబ్ బెతెల్, రొమారియో షెపర్డ్ ప్లేఆఫ్స్‌కు దూరం కానున్నారు. బెంగళూరు ఈ ఐపీఎల్‌లో అదరగొడుతోంది. ప్లేఆఫ్స్‌కు చేరడం కన్ఫార్మ్! అసలైన ప్లేఆఫ్స్‌లో స్టార్ ఆటగాళ్లు లేకపోవడం ఆర్సీబీకి పెద్ద దెబ్బే! పంజాబ్ కింగ్స్ జట్టు.. యాన్సన్, ఇంగ్లీష్ ను కోల్పోనుంది. బెంగళూరు హేజిల్‌వుడ్, షెఫర్డ్, ఫిల్ సాల్ట్, బేతెల్ ల సేవల కోల్పోయే అవకాశం ఉంది.