పారిస్ ఒలింపిక్స్‌లో డబుల్ పతకాలతో అదరగొట్టిన యువ షూటర్ మను బాకర్ తన కెరీర్ గురించి పలు ఆసక్తికర విషయాలు వెల్లడించింది. తాను అసలు షూటర్ అవుతానని అనుకోలేదని పేర్కొంది. తాజాగా సోషల్ మీడియాలో అభిమానులతో ముచ్చటించిన మను.. టోక్యో ఒలింపిక్స్‌లో పలు సందర్భాల్లో తనకు ఎదురైన అనుభవాలను పంచుకుంది. ‘మొదట్లో కెరీర్‌పై స్పష్టత ఉండేది కాదు. ఎప్పుడూ విభిన్నమైన వాటిని ప్రయత్నిస్తూనే ఉండేదాన్ని, భిన్నమైన క్రీడలపై ఆసక్తి చూపించేదాన్ని. కానీ జీవితంలో నేను కోరుకునేది ఒక్కటే.. ఆర్థికంగా స్వతంత్రంగా ఉండాలనుకోవడం. ఏదైనా మంచి పని చేయాలనుకోవడం. పోటీని ఎదుర్కోవడం అంటే నాకు ఇష్టం. అలా షూటింగ్‌పై ఆసక్తి పెంచుకొని.. దాన్నే నేర్చుకున్నా’ అని చెప్పుకొచ్చింది. మిగతా వారి కంటే ఎప్పుడూ ఉత్తమంగా రాణించాలనుకోవడం, గెలుపు కోసం కాకుండా మెరుగైన ప్రదర్శన ఇవ్వడంపైనే దృష్టి పెట్టేదాన్నని ఈ సందర్భంగా తెలిపింది.2020 టోక్యో ఒలింపిక్స్ షూటింగ్‌లో తుపాకీ మొరాయించడంతో అర్ధంతరంగా వెనుదిరగడం తనకు ఇప్పటికీ గుర్తేనని మను పేర్కొంది. ఆ బాధ నుంచి బయట పడడానికి తన తల్లి, కోచ్‌లే కారణమంది. ఆ బాధలో తన కెరీర్‌ని వదిలేయాలనుకున్నప్పుడు అమ్మ, నా కోచ్ జస్పాల్ రాణా తనలో ధైర్యాన్ని నింపి మూలస్తంభాలుగా నిలిచారని తెలిపింది. కుందేలు తాబేలు కథలో మాదిరిగా తాబేలు నెమ్మదిగానైనా లక్ష్యం దిశగా వెళితే విజయం దాసోహం అవుతుందనేది తాను విశ్వసిస్తానని చెప్పుకొచ్చింది.