ఫుట్‌బాల్ ప్రపంచంలో అత్యంత ప్రఖ్యాతి గాంచిన స్టార్ లియోనెల్ మెస్సీ భారత్‌లో అడుగుపెట్టనున్నాడు. అర్జెంటీనా ఫుట్‌బాల్ అసోసియేషన్ (ఏఎఫ్‌ఏ) తాజాగా విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం నవంబర్ 10 నుంచి 18 మధ్య కేరళలో అర్జెంటీనా జట్టు ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడనుంది. ఈ మేరకు ఏఎఫ్‌ఏ కీలక ప్రకటన చేసింది. దీంతో తొలుత డిసెంబర్ మధ్యలో మెస్సీ భారత్ పర్యటన ఉంటుందని వచ్చిన వార్తలకు తెరపడింది. 2011లో కోల్‌కతాలో జరిగిన ఒక ఈవెంట్‌లో చివరిసారిగా భారత్‌కు వచ్చిన మెస్సీ, ఈసారి తన జట్టుతో కలిసి మళ్లీ దేశంలో ఆడనుండటం అభిమానుల్లో భారీ ఉత్సాహాన్ని కలిగిస్తోంది. ఏఎఫ్‌ఏ ప్రకారం, అక్టోబర్ 6-14 మధ్య అమెరికాలో ఒక ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడనున్నారు. అనంతరం నవంబర్ 10-18 మధ్య అర్జెంటీనా జట్టు లాండా, అంగోలా, కేరళలో పర్యటించనుంది. ఈ టూర్‌లో భాగంగా కేరళలో రెండో ఫ్రెండ్లీ మ్యాచ్ జరగనుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీని మెస్సీ కలుస్తాడా లేదా అనేది ఇంకా స్పష్టత రాలేదు.
అలాగే కోల్‌కతా, ముంబయి, న్యూఢిల్లీ పర్యటనలపై కూడా ఏఎఫ్‌ఏ నుంచి క్లారిటీ ఇవ్వలేదు. అయితే కేరళలో మాత్రం మ్యాచ్ ఖాయం అయ్యిందని ఏఎఫ్‌ఏ ప్రకటన స్పష్టం చేసింది. గ్రీన్‌ఫీల్డ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో మ్యాచ్ నిర్వహణకు కేరళ ప్రభుత్వం ఇప్పటికే సానుకూలంగా స్పందించింది. రాష్ట్ర మంత్రి అబ్దుల్ రహీమ్ జూన్ 6న చేసిన ప్రకటన ఇప్పుడు నిజమైంది. ఫుట్‌బాల్‌కు విపరీతమైన ఆదరణ ఉన్న కేరళలో మెస్సీ ఆడటం అభిమానులకు పండుగ వాతావరణాన్ని తీసుకొచ్చే అవకాశం ఉంది.