క్రికెటర్ ఛతేశ్వర్ పుజారా ఫ్యామిలీలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఛతేశ్వర్ పుజారా బావమరిది జీత్ రసిక్‌భాయ్ పబారి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన రాజ్‌కోట్‌లో చోటుచేసుకుంది. పుజారా బావమరిది జీత్ రసిక్‌భాయ్ పబారి గుజరాత్ రాజ్‌కోట్‌లోని తన నివాసంలో ఆత్మహత్యకు యత్నించారు. అయితే ఇందుకు సంబంధించిన సమాచారం అందుకున్న స్థానిక మాల్వియా నగర్ పోలీసులు వెంటనే అక్కడికి చేరుకున్నారు. జీత్ పబారిని సమీపంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే జీత్ పబారి మరణించినట్టుగా వైద్యులు ధ్రువీకరించారు. ఈ క్రమంలోనే జీత్ పబారి మృతదేహాన్ని పోస్ట్‌మార్టం పరీక్షల కోసం పంపారు. అయితే జీత్ పబారి ఆత్మహత్యకు గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
చతేశ్వర్ పుజారా భార్య పూజ సోదరుడే జీత్ పబారి. చతేశ్వర్ పుజారా 2013 ఫిబ్రవరిలో పూజా పబారిని వివాహం చేసుకున్నారు. చతేశ్వర్ పుజారా అత్తమామలు జాంజోధ్పూర్కు చెందినవారు... కానీ గత ఇరవై సంవత్సరాలుగా రాజ్‌కోట్‌లో నివసిస్తున్నారు. అతని అత్తమామలు కాటన్ జిన్నింగ్ ఫ్యాక్టరీని నడుపుతున్నారు. జీత్ పబారికి గతంలో ఒక మహిళతో నిశ్చితార్థం జరిగింది. ఆ తర్వాత నిశ్చితార్థం రద్దైంది. ఈ క్రమంలోనే ఆ మహిళ... జీత్ పబారిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదులో జీత్ పబారిపై సంచలన ఆరోపణలు చేశారు. జీత్ పబారి పెళ్లి చేసుకుంటానని హామీ ఇచ్చి తనతో బలవంతంగా శారీరక సంబంధం పెట్టుకున్నాడని ఆమె ఆరోపించారు. ఇందుకు సంబంధించి జీత్ పబారిపై గతేడాది నవంబర్‌లో మాల్వియా నగర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. అయితే ఈ కేసు నుంచి కొనసాగుతున్న ఒత్తిడి అతని మానసిక స్థితిని ప్రభావితం చేసిందా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.