Ravindra Jadeja : జడేజా ప్రపంచ రికార్డు .. 147 ఏళ్ల చరిత్రలో ఇదే తొలిసారి
టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా టెస్టు క్రికెట్‌లో అత్యంత అరుదైన ఘనత సాధించాడు. బంగ్లాదేశ్‌తో తొలి టెస్టు సందర్భంగా ప్రపంచ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక రెండో టెస్టులో మరొక వికెట్ తీస్తే చాలు.. మరో ఎలైట్ జాబితాలోనూ చోటు దక్కించుకుంటాడు. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ 2023–-25 సీజన్‌లో భాగంగా టీమిండియా బంగ్లాదేశ్‌తో రెండు మ్యాచ్‌ల సిరీస్ ఆడుతోంది. ఈ క్రమంలో చెన్నైలో జరిగిన తొలి టెస్టులో రోహిత్ సేన.. నజ్ముల్ షాంటో బృందాన్ని 280 పరుగుల తేడాతో చిత్తు చేసింది. సమష్టి ప్రదర్శనతో బంగ్లాదేశ్‌ను మట్టికరిపించింది.
ఇక ఈ మ్యాచ్‌లో భారత స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ జడేజా.. 86 పరుగులు చేయడంతో పాటు.. ఐదు వికెట్లు పడగొట్టాడు. తద్వారా టీమిండియా విజయంలో తన వంతు పాత్ర పోషించి.. ఓ రేర్ ఫీట్ నమోదు చేశాడు. తన జట్టు టెస్టుల్లో గెలిచిన సందర్భాల్లో 2 వేలకు పైగా పరుగులు సాధించడంతో పాటు.. 200కు పైగా వికెట్లు తీసిన తొలి క్రికెటర్‌గా చరిత్రకెక్కాడు. 147 ఏళ్ల టెస్టు క్రికెట్ చరిత్రలో ఓ ఆటగాడు ఈ ఘనత సాధించడం ఇదే తొలిసారి. టీమిండియా గెలిచిన సందర్భాల్లో ఇప్పటి వరకు జడ్డూ 2003 రన్స్ చేశాడు. అంతేకాదు 218 వికెట్లు కూడా పడగొట్టాడు. ఈ జాబితాలో రవిచంద్రన్ అశ్విన్ (1943 రన్స్, 369 వికెట్లు) జడ్డూ తర్వాతి స్థానాన్ని ఆక్రమించాడు.