RED CARD: రెడ్ కార్డ్‌కు బలైన తొలి క్రికెటర్ ఎవరంటే...
కరేబియన్ ప్రీమియర్ లీగ్‌లో తొలిసారిగా రెడ్ కార్డ్ అమలు....
రెడ్‌కార్డ్ (Red card)... మాములుగా ఫుట్‌బాల్, రగ్భీ, హాకీలాంటి క్రీడల్లో కనిపిస్తుంటుంది. ఆటగాడు నిబంధనలు అతిక్రమించినా, దూకుడుగా వ్యవహరించినా.. ప్రత్యర్థి ఆటగాడిని ఉద్దేశపూర్వకంగా గాయపరిచినా ఈ రెడ్ కార్డ్ చూపిస్తారు. ఇప్పుడు ఈ రెడ్ కార్డ్ క్రికెట్‌లోకి ప్రవేశించింది. కరీబియన్ ప్రీమియర్ లీగ్(Caribbean Premier League)లో దీన్ని ప్రవేశపెట్టారు. ఈ నిబంధనకు బలైన తొలి క్రికెటర్‌గా సునీల్ నరైన్ (Sunil Narine) చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు. కరీబియన్ ప్రీమియర్ లీగ్ ప్రస్తుత ఎడిషన్‌లోనే తొలిసారి క్రికెట్‌లో ఈ రెడ్ కార్డ్ రూల్ అమల్లోకి వచ్చింది.
సెయింట్ కిట్స్ అండ్ నెవిస్ పాట్రియాట్స్(St Kitts and Nevis Patriots), ట్రిన్‌బాగో నైట్‌రైడర్స్(Trinbago Knight Riders ) మధ్య జరిగిన మ్యాచ్‌లో సునీల్ నరైన్‌కు అంపైర్ రెడ్ కార్డ్ చూపించి, మైదానాన్ని వీడాల్సిందిగా ఆదేశించాడు. దీంతో రెడ్ కార్డ్ కారణంగా మైదానం వీడిన తొలి క్రికెటర్‌గా సునీల్ నరైన్ చెత్త రికార్డు మూటగట్టుకున్నాడు. ఈ లీగ్‌లో నరైన్ ట్రిన్‌బాగో నైట్‌రైడర్స్ జట్టు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఆ జట్టు నిర్ణీత సమయంలో 20 ఓవర్లు వేయనందుకు నరైన్ రెడ్‌కార్డ్ రూల్‌తో మైదానం వీడాడు. CPLలో కొత్త నిబంధనల ప్రకారం.. నిర్ణీత సమయంలోగా 18 ఓవర్‌ను ప్రారంభించకపోతే ఆ ఓవర్‌లో 30-యార్డ్ సర్కిల్ వెలుపల నలుగురు ఫీల్డర్లు మాత్రమే ఉండాలి.
మ్యాచ్‌లో ట్రిన్‌బాగో నైట్‌రైడర్స్ 17, 18, 19వ ఓవర్లను కోటా సమయంలో పూర్తి చేయకపోవడంతో అంపైర్ ఆ జట్టులోని ఓ ఫీల్డర్‌ను మైదానం వీడాల్సిందిగా ఆదేశించాడు. ఏ ఆటగాడిని బయటకు పంపించాలనేది కెప్టెన్ ఇష్టం. ట్రిన్‌బాగో నైట్‌రైడర్స్ కెప్టెన్ పొలార్డ్(Kieron Pollard).. నరైన్‌ను మైదానాన్ని వీడాలని కోరడంతో (sends off Sunil Narine) అతడు డగౌట్‌లోకి వెళ్లిపోయాడు. దీంతో నైట్‌రైడర్స్ 10 మంది ఆటగాళ్లతోనే చివరి ఓవర్ కొనసాగించింది.
ఈ మ్యాచ్‌లో సెయింట్ కిట్స్ అండ్ నెవిస్ పేట్రియాట్స్‌పై ట్రిన్‌బాగో నైట్‌రైడర్స్ 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన సెయింట్ కిట్స్.. షెర్ఫాన్ రూథర్‌ఫోర్డ్ 62 పరుగులతో రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 178 పరుగులు చేసింది. నైట్‌రైడర్స్ బౌలర్లలో సునీల్ నరైన్ 3 వికెట్లతో రాణించగా.. బ్రావో 2 వికెట్లు పడగొట్టాడు.
179 పరుగుల లక్ష్యఛేదనలో నికోలస్ పూరన్, 61 పరుగులు, కీరన్ పోలార్డ్ 37 పరుగులు, రసెల్ 8 బంతుల్లోనే 23 పరుగులతో చెలరేగిపోవడంతో నైట్‌రైడర్స్ 17.1 ఓవర్లలో కేవలం 4 వికెట్లు మాత్రమే కోల్పోయి గెలిచింది.