భారత సీనియర్ టెన్నిస్ ఆటగాడు రోహన్ బోపన్న చైనా ఓపెన్‌లో నిరాశపరిచాడు. ఏటీపీ 500 టోర్నీ అయిన చైనా ఓపెన్ పురుషుల డబుల్స్‌లో ఇవాన్ డోడిగ్(క్రొయేషియా)తో కలిసి ఆడిన బోపన్న తొలి రౌండ్‌లోనే చుక్కెదురైంది. శనివారం జరిగిన మ్యాచ్‌లో బోపన్న ద్వయానికి అన్‌సీడెడ్ ఆటగాళ్లు చెక్ పెట్టారు. చైనా ఓపెన్‌లో ఫేవరెట్‌గా అడుగుపెట్టిన బోపన్న – ఇవాన్ జోడీకి ఫ్రాన్సిస్కో సెరునుడొలో, నికోలస్ జారీలు ఊహించని షాక్ ఇచ్చారు. హోరాహోరీగా సాగిన మ్యాచ్‌లో ఫ్రాన్సిస్కో, నికోలస్ ద్వయం బోపన్న జంటకు గట్టి పోటీనిచ్చింది. తొలి సెట్‌ను ఒక్క పాయింట్ తేడాతో గెలుపొంది.. రెండో సెట్‌ను కూడా అంతే తేడాతో సొంతం చేసుకుంది. దాంతో, బోపన్న ద్వయం 5-6, 6-7తో అనూహ్యంగా ఓటమి పాలైంది. బోపన్న క్రొయేషియా కెరటం ఇవాన్‌తో కలిసి ఆడడం ఇదే మొదటిసారి కాదు. వీళ్లిద్దరూ 2017 ఏటీపీ మాంట్రియల్ మాస్టర్స్ 1000 టోర్నీలో దుమ్మురేపారు. కానీ, ఆఖరి మెట్టుపై తడబడి రన్నరప్‌తో సరిపెట్టుకున్నారు. యూఎస్ ఓపెన్‌లోనూ క్వార్టర్స్‌కు ముందే ఇంటిదారి పట్టిన సంగతి తెలిసిందే.