US OPEN: రోహన్ బోపన్న నయా రికార్డు
యూఎస్ ఓపెన్ డబుల్స్ ఫైనల్లోకి దూసుకెళ్లిన బోపన్న జోడి... సెమీస్‌లోకి అల్కరాజ్, మెద్వెదేవ్;
భారత స్టార్ టెన్నీస్ ప్లేయర్ రోహన్ బోపన్న రికార్డు సృష్టించాడు. రోహన్ బోపన్న, ఎబ్డెన్ జోడీ డబుల్స్ ఫైనల్‌కు దూసుకెళ్లింది. యూఎస్ ఓపెన్ పురుషుల డబుల్స్ విభాగంలో ఆరో సీడ్ రోహన్ బోపన్న- మాథ్యూ ఎబ్డెన్ (ఆ్రస్టేలియా) జోడీ ఫైనల్‌కు దూసుకెళ్లింది. సెమీఫైనల్లో బోపన్న–ఆస్ట్రేలియాకు చెందిన ఎబ్డెన్ ద్వయం 7–6 (7/3), 6–2తో ఫ్రాన్స్‌కు చెందిన పియరీ హ్యూజ్ హెర్బర్ట్–నికోలస్ మహుట్ జంటను ఓడించింది. 94 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో బోపన్న జోడీ తన ప్రత్యర్థి జంట సర్వీస్‌ను మూడుసార్లు బ్రేక్ చేసింది. రాజీవ్ రామ్ (అమెరికా)–సాలిస్‌బరీ (బ్రిటన్); ఇవాన్ డోడిగ్ (క్రొయేషియా)–ఆస్టిన్ క్రాయిసెక్ (అమెరికా) మధ్య రెండో సెమీఫైనల్ విజేతతో ఫైనల్లో బోపన్న జంట తలపడుతుంది. తాజా ఫలితంతో 43 ఏళ్ల బోపన్న ఓపెన్ శకంలో గ్రాండ్‌స్లామ్ టోర్నీలో ఫైనల్ చేరిన పెద్ద వయస్కుడిగా రికార్డు నెలకొల్పాడు. తన కెరీర్‌లో పురుషుల డబుల్స్ విభాగంలో బోపన్న గ్రాండ్‌స్లామ్ టోర్నీలో ఫైనల్‌కు చేరడం ఇది రెండోసారి మాత్రమే. 2010లో ఐజామ్ ఖురేషి (పాకిస్తాన్)తో జతకట్టి యూఎస్ ఓపెన్‌లోనే ఫైనల్ చేరిన బోపన్న తుది పోరులో బాబ్ బ్రయాన్–మైక్ బ్రయాన్ (అమెరికా) ద్వయం చేతిలో ఓడి రన్నరప్‌గా నిలిచాడు.
మరోవైపు ప్రపంచ నంబర్ వన్ ప్లేయర్ అల్కరాజ్ చరిత్ర సృష్టించేందుకు మార్గం సుగుమం చేసుకుంటున్నాడు. పదిహేనేళ్లుగా యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నీ పురుషుల సింగిల్స్ విభాగంలో వరుసగా రెండేళ్లు ఒకే ప్లేయర్‌కు టైటిల్ దక్కలేదు. ఈ ఘనత సాధించేందుకు ప్రపంచ నంబర్‌వన్ కార్లోస్ అల్కరాజ్ చేరువయ్యాడు. సీజన్ నాలుగో గ్రాండ్‌స్లామ్ టోర్నీలో ఈ స్పెయిన్ స్టార్ అలవోక విజయంతో సెమీఫైనల్లోకి దూసుకెళ్లాడు. 12వ సీడ్ జర్మనీకి చెందిన అలెగ్జాండర్ జ్వెరెవ్‌తో జరిగిన క్వార్టర్ ఫైనల్లో అల్‌కరాజ్ 2 గంటల 30 నిమిషాల్లో 6–3, 6–2, 6–4తో విజయం సాధించాడు. ఫైనల్లో చోటు కోసం డిఫెండింగ్ ఛాంపియన్ అల్కరాజ్‌తో మెద్వెదెవ్ తలపడతాడు.
మరో క్వార్టర్ ఫైనల్లో మూడో సీడ్, రష్యాకు చెందిన డానిల్ మెద్వెదెవ్‌పై ఎనిమిదో సీడ్, తన దేశానికే చెందిన ఆండ్రీ రుబ్లెవ్‌ను ఓడించి ఈ టోర్నీలో నాలుగోసారి సెమీఫైనల్లోకి ప్రవేశించాడు. 2021లో చాంపియన్‌గా నిలిచిన మెద్వెదెవ్ ... 2020లో సెమీఫైనల్లో, 2019లో ఫైనల్లో ఓడిపోయాడు.
మహిళల సింగిల్స్ విభాగంలో ప్రపంచ తొమ్మిదో ర్యాంకర్, ఈ ఏడాది వింబుల్డన్ ఛాంపియన్ చెక్ రిపబ్లిక్ మర్కెటా వొండ్రుసోవా పోరాటం ముగిసింది. 17వ సీడ్ మాడిసన్ కీస్ (అమెరికా) 6–1, 6–4తో వొండ్రుసోవాను బోల్తా కొట్టించి ఈ టోర్నీలో 2018 తర్వాత మళ్లీ సెమీఫైనల్లోకి అడుగు పెట్టింది. 86 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో కీస్ మూడుసార్లు వొండ్రుసోవా సర్వీస్‌ను బ్రేక్ చేసింది. సెమీఫైనల్స్‌లో రెండో సీడ్ సబలెంకా (బెలారస్)తో కీస్; ముకోవా (చెక్ రిపబ్లిక్)తో కోకో గాఫ్ (అమెరికా) తలపడతారు.