IPL: రాజస్థాన్‌పై పంజాబ్ కింగ్స్ విజయం

ప్లే ఆఫ్స్‌ చేరిన పంజాబ్... రాజస్థాన్‌ పరాజయాల పరంపర;

Update: 2025-05-19 02:30 GMT

కొత్త కెప్టెన్, కొత్త కోచ్ సారథ్యంలో ఐపీఎల్ 2025 టైటిల్ వేట ప్రారంభించిన పంజాబ్.. ఎనిమిదో విజయాన్ని నమోదు చేసింది. రాజస్థాన్‌తో జరిగిన మ్యాచులో గెలుపుతో పాయింట్స్ టేబుల్‌లో రెండో ప్లేసుకు దూసుకెళ్లింది. టాప్‌లో ఉన్న ఆర్సీబీతో సమానంగా 17 పాయింట్లు ఉన్నప్పటికీ నెట్‌రన్‌ రేట్‌లో తక్కువగా ఉండటంతో పంజాబ్ రెండో ప్లేసులో ఉంది. ఇప్పటికే మూడు మ్యాచ్‌లలో ఓడిన రాజస్థాన్.. పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ పరాజయం పాలైంది. 220 పరుగుల లక్ష్య ఛేదనలో.. ఓ దశలో 4.4 ఓవర్లలో 76/0తో నిలిచిన రాజస్థాన్ అనూహ్యంగా తడబడింది. భారీ ఆశలు పెట్టుకుని రిటైన్ చేసుకున్న హిట్‌మెయిర్‌ మరోసారి విఫలమై.. ఆ జట్టు పరాజయంలో పాలు పంచుకున్నాడు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్.. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 219 పరుగులు స్కోరు చేసింది. నేహాల్ వధేరా ( 37 బంతుల్లోనే 70 రన్స్), శశాంక్ సింగ్‌ (30 బంతుల్లోనే 59 రన్స్) హాఫ్ సెంచరీలతో రాణించారు. చివర్లో అజ్మతుల్లా ఒమర్జాయ్ (9 బంతుల్లో 21 రన్స్‌) మంచి ఫినిషింగ్ ఇచ్చాడు. రాజస్థాన్ రాయల్స్ బౌలర్లలో తుశార్ దేశ్ పాండే 2, మఫాక 1, రియాన్ పరాగ్ 1, ఆకాశ్ మధ్వాల్ 1 వికెట్ తీశారు.

భారీ లక్ష్య ఛేదనలో...

అనంతరం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్‌కు యువ ఓపెనర్లు యశస్వి జైశ్వాల్ (25 బంతుల్లో 50 రన్స్‌), వైభవ్ సూర్యవంశీ (15 బంతుల్లో 40 రన్స్‌) మెరుపు ఆరంభించారు. దీంతో పవర్‌ ప్లే ముగిసే సరికి రాజస్థాన్ రాయల్స్ 89/1తో స్పష్టమైన ఆధిక్యంలో ఉంది. ఓపెనర్ల దెబ్బకు సాధించాల్సిన రన్ రేట్ కూడా 10 దిగువకు వచ్చింది. అయితే ఓపెనర్లు ఇద్దరూ ఔట్ అయ్యాక రాజస్థాన్ ఇన్నింగ్స్ గాడి తప్పింది. వైభవ్ సూర్యవంశీ కోసం తన ఓపెనింగ్ స్థానాన్ని త్యాగం చేసి వన్‌డౌన్‌లో వచ్చిన సంజూ శాంసన్ (16 బంతుల్లో 20 రన్స్‌) విఫలమయ్యాడు. రియాన్ పరాగ్ (11 బంతుల్లో 13 రన్స్‌) కూడా త్వరగానే పెవిలియన్ చేరాడు. 11 కోట్లతో రిటైన్ చేసుకున్న షిమ్రాన్ హిట్‌మెయర్ మరోసారి విఫలమయ్యాడు. దీంతో రాజస్థాన్‌కు ఓటమి తప్పలేదు.

కట్టుదిట్టంగా బౌలింగ్ చేసిన అర్ష్‌దీప్

డెత్ ఓవర్‌లలో అర్షదీప్ సింగ్ కట్టుదిట్టంగా బంతులేయడంతో నిర్ణీత 20 ఓవర్లలో రాజస్థాన్ రాయల్స్.. 7 వికెట్ల నష్టానికి 209 రన్స్‌కి పరిమితమైంది. 10 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఇప్పటికే ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించిన రాజస్థాన్... ఆడిన 13వ మ్యాచ్‌లో 10వ ఓటమిని చవిచూసింది. అటు పంజాబ్ కింగ్స్.. 8వ విజయంతో పాయింట్స్ టేబుల్‌లో 2వ ప్లేసుకు దూసుకెళ్లి ప్లే ఆఫ్స్‌కు చేరింది. 

Tags:    

Similar News