Shakib Al Hasan : షకీబ్ అల్ హసన్ సంచలన నిర్ణయం .. టెస్టు క్రికెట్ కు వీడ్కోలు
బంగ్లాదేశ్ స్టార్ ఆల్‌రౌండర్ షకీబ్ అల్ హసన్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. టెస్టు ఫార్మాట్‌కు వీడ్కోలు పలుకుతున్నట్లు గురువారం ప్రకటించాడు. స్వదేశంలో సౌతాఫ్రికాతో జరుగబోయే టెస్టు సిరీస్ తన కెరీర్‌లో చివరిదని తెలిపాడు. ఈ మేరకు షకీబ్ కాన్పూర్‌లో మాట్లాడుతూ.. ‘టెస్టు ఫార్మాట్‌లో మిర్‌పూర్లో సౌతాఫ్రికాతో ఆడబోయే మ్యాచ్ నా కెరీర్‌లో ఆఖరిది. సొంతగడ్డపై నా అభిమానుల మధ్య టెస్టు కెరీర్ ముగించడం సంతోషకరంగా ఉంటుంది. బంగ్లాదేశ్ క్రికెట్ నాకెంతో చేసింది. పేరు, ప్రతిష్ట అన్నీ ఇచ్చింది. అందుకే నా ఆఖరి టెస్టు స్వదేశంలోనే ఆడాలని నిర్ణయించుకున్నా’ అని పేర్కొన్నాడు. ఇక బంగ్లాదేశ్‌లో తన పరిస్థితి ఏమిటన్న ప్రశ్నలకు బదులిస్తూ.. ‘బంగ్లాదేశీ పౌరుడిగా ఇండియా నుంచి అక్కడికి వెళ్లేందుకు నాకు ఎలాంటి సమస్యా ఎదురుకాకపోవచ్చు. అయితే, ఒక్కసారి అక్కడకు వెళ్తే బయటకు వచ్చే పరిస్థితి ఉండకపోవచ్చు. నా కుటుంబ సభ్యులు, సన్నిహితులు బంగ్లాదేశ్‌లోని పరిస్థితుల గురించి ఎప్పటికపుడు నాకు చెబుతూనే ఉన్నారు. నేను కూడా ప్రస్తుతం సందిగ్దావస్థలోనే ఉన్నాను’ అని షకీబ్ కీలక వ్యాఖ్యలు చేశారు.