భారత స్టార్ క్రికెటర్, కెప్టెన్ రోహిత్ శర్మ గొప్ప కెప్టెన్ అని టీమిండియా మాజీ క్రికెటర్ శిఖర్ ధావన్ అన్నాడు. ఇటీవల అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికిన ధావన్.. జాతీయ జట్టులో స్థానం కోసం దేశవాళీ క్రికెట్లో ఆడే ప్రేరణ లేకపోవడం వల్లే రిటైరయ్యానని చెప్పాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో గబ్బర్ మాట్లాడుతూ..‘నేను దేశవాళీ క్రికెట్ ఆడాలనుకోలేదు. అందులో ఆడాలనే ఉత్తేజం నాలో లేదు. నా కెరీర్ చివరి రెండేళ్లలో నేను పెద్దగా అంతర్జాతీయ క్రికెట్ ఆడలేదు. ఐపీఎల్‌లో మాత్రమే ఆడా. మొత్తంగా ఆ రెండేళ్లలో నేను ఆడింది తక్కువ. ఇక చాలు, చాలా క్రికెట్టే ఆడాననుకున్నా. విరామం కావాలనిపించింది. ఎక్కువగా క్రికెట్ ఆడకపోవడంతో అంతగా ఫామ్‌లో కూడా లేను. నేను సంతోషంగా ఉన్నా. కెరీర్‌లో సాధించిన దాని పట్ల సంతృప్తి చెందా. ప్రపంచకప్ గెలిస్తే బాగుండేదనుకోండి. రోహిత్ గొప్ప కెప్టెన్. కెప్టెన్‌గా అతడు దేశానికి ప్రపంచకప్‌ను అందించినందుకు సంతోషంగా ఉంది. చాలా కాలం ప్రపంచకప్ కోసం ఎదురుచూశాం. టైటిల్‌కు చేరువయ్యాం కూడా. ఇప్పుడు టీ20 ప్రపంచకప్‌తో లక్ష్యాన్ని అందుకున్నాం’ అని ధావన్ చెప్పుకొచ్చాడు. టీమ్‌ఇండియా తరఫున ధావన్ 34 టెస్టులు, 167 వన్డేలు, 68 టీ20 మ్యాచ్‌లు ఆడాడు.