India vs West Indies : సూర్య సునామీ ఇన్నింగ్స్
వెస్టిండీస్‌తో మూడో టీ ట్వంటీలో భారత్ సునాయస విజయం... మరోసారి రాణించిన తెలుగు కుర్రాడు తిలక్ వర్మ;
సిరీస్‌లో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో టీమిండియా సత్తా చాటింది. సూర్యకుమార్ యాదవ్(Suryakumar Yadav ) విధ్వంసానికి తోడు తిలక్‌వర్మ(Tilak Varma) సమయోచిత ఇన్నింగ్స్ కలిసి రావడంతో విండీస్‌తో జరిగిన మూడో టీ ట్వంటీ(India vs West Indies)లో భారత్ సునాయస విజయం సాధించింది. ఈ గెలుపుతో సిరీస్ ఆశలను హార్దిక్ సేన సజీవంగా ఉంచుకుంది.
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న వెస్టిండీస్‌కు ఓపెనర్లు శుభారంభం అందించారు. బ్రెండన్ కింగ్(Brandon King)42, కైల్ మేయర్స్ జోడి 7 ఓవర్లలో 50 పరుగులు జోడించింది. ఎనిమిదో ఓవర్‌లో అక్షర్.... మేయర్స్‌ను ఔట్ చేసి మొదటి వికెట్ భాగస్వామ్యాన్ని విడదీశాడు. చార్లెస్‌ను కుల్‌దీప్(Kuldeep Yadav) అవుట్ చేశాడు. భారత బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో అయిదు ఓవర్లలో కరేబియన్లు కేవలం 24 పరుగులే చేయగలిగారు. గత మ్యాచ్‌లో విండీస్‌కు విజయం సాధించి పెట్టిన పూరన్ మరోసారి విండీస్ ఇన్నింగ్స్‌కు ఊపు తెచ్చాడు. కుల్‌దీప్ బౌలింగ్‌లో వరుసగా 6, 4 కొట్టిన పూరన్ హార్దిక్ బౌలింగ్‌లో మరో ఫోర్ కొట్టాడు. కానీ 15వ ఓవర్లో 20 పరుగులు చేసిన పూరన్‌తోపాటు కింగ్‌ను ఔట్ కుల్‌దీప్ అవుట్ చేసి విండీస్‌కు కుల్‌దీప్ షాకిచ్చాడు. 16 ఓవర్లకు 113 పరుగులే చేసిన విండీస్.. తక్కువ స్కోరే చేసేలా కనిపించింది. కానీ రోమన్ పావెల్(Rovman Powell (40)) చెలరేగి ఆడాడు. చివరి నాలుగు ఓవర్లలో వెస్టిండీస్ 46 పరుగులు చేసింది. పావెల్ రెండు సిక్స్‌లు బాదడంతో 19వ ఓవర్లో అర్ష్‌దీప్ ఏకంగా 17 పరుగులు సమర్పించుకున్నాడు. ఆఖరి ఓవర్లో ముకేశ్ బౌలింగ్‌లో పావెల్ మరో సిక్స్ దంచేశాడు. కేవలం 19 బంతుల్లోనే రోమన్ పావెల్ 40 పరుగులు చేయడంతో విండీస్ 159 పరుగులు చేసింది.
160 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌కు శుభారంభం దక్కలేదు. భారత ఓపెనర్లిద్దరూ విఫలమయ్యారు. ఇషాన్ కిషన్ స్థానంలో జట్టులోకి వచ్చిన అరంగేట్ర బ్యాటర్ యశస్వి జైస్వాల్ ఒక పరుగుకే తొలి ఓవర్లో అవుటయ్యాడు. అయిదో ఓవర్లో ఆరు పరుగులు చేసిన గిల్ కూడా వెనుదిరిగాడు. సూర్యకుమార్ యాదవ్ విధ్వంసం తొలి బంతి నుంచే ప్రారంభమైంది. జైస్వాల్ అవుట్ అయ్యాక వచ్చిన సూర్య.. తొలి రెండు బంతుల్లో వరుసగా 4, 6 కొట్టి తన ఉద్దేశాన్ని చాటి చెప్పాడు. విండీస్ బౌలర్లను ఊచకోత కోసిన సూర్య కేవలం 44 బంతుల్లోనే 83 పరుగులు చేశాడు. కళ్లు చెదిరే షాట్లతో ఎడాపెడా ఫోర్లు, సిక్స్‌లతో టీమిండియాను విజయం వైపు నడిపించాడు. మెకాయ్ వేసిన ఆరో ఓవర్లో రెండు ఫోర్లు, ఓ సిక్స్, షెపర్డ్ వేసిన తర్వాత ఓవర్లో వరుసగా రెండు ఫోర్లు సాధించిన సూర్య.. 23 బంతుల్లోనే అర్ధశతకం పూర్తి చేసుకున్నాడు. సూర్య విధ్వంసంతో భారత్ 12 ఓవర్లలో 114/2తో తిరుగులేని స్థితిలో నిలిచింది. సెంచరీ దిశగా సాగుతున్న సూర్య... బ్యాక్‌వర్డ్ స్క్వేర్ లెగ్‌లో క్యాచ్ ఔటయ్యాడు. చివరి ఏడు ఓవర్లలో చేయాల్సింది 37 పరుగులే కావడంతో భారత్ కంగారు పడాల్సిన అవసరం లేకపోయింది.
తెలుగు కుర్రాడు తిలక్ వర్మ సూర్యకు చక్కని సహకారం అందించాడు. సూర్యతో మూడో వికెట్‌కు 87 పరుగులు జోడించిన తిలక్.. హార్దిక్‌తో నాలుగో వికెట్‌కు 43 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. తిలక్ వర్మ 37 బంతుల్లో 49 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. సూర్య, తిలక్ జోరుతో లక్ష్యాన్ని భారత్ 17.5 ఓవర్లలోనే 3 వికెట్లు కోల్పోయి అలవోకగా ఛేదించింది. సిరీస్‌లో విండీస్ 2-1తో ఆధిక్యంలో ఉంది. నాలుగో టీ20 శనివారం జరుగుతుంది.