SKY: సూర్యకుమార్ యాదవ్ అరుదైన ఘనత
ఐపీఎల్‌లో 4000 పరుగులు పూర్తి చేసిన సూర్యకుమార్;
ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో సుర్యకుమార్ యాదవ్ అరుదైన ఘనత సాధించాడు. ఐపీఎల్ చరిత్రలో 4000 పరుగులు పూర్తి చేసిన 17వ ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. భారత్ నుంచి ఈ అరుదైన ఘనత సాధించిన 13వ ఆటగాడిగా సూర్య నిలిచాడు. లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సుర్య భాయ్ ఈ ఘనత సాధించాడు. 4000 పరుగులను సూర్య కేవలం 2705 బంతుల్లో సాధించాడు. 4000 పరుగులను వేగంగా సాధించిన మూడో బ్యాటర్‌గానూ సూర్య నిలిచాడు. ఐపీఎల్‌లో 4000 పరుగులను వేగంగా అందుకున్న ఆటగాడిగా యూనివర్సల్ బాస్ గేల్ టాప్‌లో ఉన్నాడు. గేల్ కేవలం 2653 బంతుల్లోనే 4000 పరుగులు సాధించాడు. ఆ తర్వాతి స్థానంలో మిస్టర్ 360 ఏబీ డివిలియర్స్ ఉన్నాడు. డివిలియర్స్ 2658 బంతుల్లో 4000 పరుగులు సాధించాడు. లక్నో బౌలర్ ప్రిన్స్ యాదవ్ బౌలింగ్‌లో సిక్స్ బాదడంతో సుర్యకుమార్ యాదవ్ 4000 ఐపీఎల్ పరుగుల మైలురాయి చేరుకున్నాడు.
అగ్రస్థానం కోహ్లీదే
మరోవైపు ఐపీఎల్‌లో అత్యధిక పరుగులు చేసిన జాబితాలో విరాట్ కోహ్లీ టాప్‌లో ఉన్నాడు. విరాట్ ఐపీఎల్‌లో 8396 పరుగులు చేశాడు. ఆ తర్వాతి స్థానంలో రోహిత్ శర్మ ఉన్నాడు. హిట్‌మ్యాన్ 6868 పరుగులతో రెండు స్థానంలో ఉన్నాడు. అత్యధిక పరుగులు చేసిన జాబితాలో శిఖర్ ధావన్ 6769 పరుగులతో మూడో స్థానంలో ఉన్నాడు. డేవిడ్ వార్నర్, సురేష్ రైనా, ఎం.ఎస్ ధోని, ఏబీ డివిలియర్స్, కెఎల్ రాహుల్, క్రిస్ గేల్, రాబిన్ ఉతప్ప తర్వాతి స్థానాల్లో ఉన్నారు. ఈ జాబితాలో సూర్యకుమార్ యాదవ్ 17వ స్థానంలో ఉన్నాడు.
ముంబై తరపునే..
సుర్యకుమార్ 2012లో తన ఐపీఎల్ ప్రయాణాన్ని ముంబై ఇండియన్స్ తో ప్రారంభించాడు. కానీ ఆ సీజన్లో ఒకే ఒక మ్యాచ్‌లో ఆడినా పరుగులు చేయలేదు. 2014లో కోల్‌కతా నైట్ రైడర్స్‌లో మిడిల్ ఆర్డర్‌లో బ్యాటింగ్ చేస్తూ మంచి గుర్తింపు పొందాడు. 2018లో ముంబై ఇండియన్స్ సూర్య ప్రతిభను గుర్తించి తిరిగి తీసుకుంది. ఈ మార్పు నిజంగానే అతని కెరీర్‌కు మలుపు తిప్పింది. ముంబైకి తిరిగి వచ్చాక బ్యాటింగ్ సూర్య మ్యాచ్ విన్నర్ గా మారాడు. ముంబై తరఫున 104 మ్యాచ్‌లలో 3319 పరుగులు చేశాడు. ఎంఐకి ఆడుతూ 25 అర్ధశతకాలు, 2 శతకాలు చేశాడు. 5 సార్లు ఐపీఎల్ ఛాంపియన్ అయిన ముంబై జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు.