భారత స్టార్ క్రికెటర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ పెద్దగా ఫామ్‌లో లేరు. బంగ్లాదేశ్‌పై ఓ మోస్తరు పరుగులు చేసినా.. న్యూజిలాండ్‌తో మాత్రం తేలిపోయారు. ఐదు టెస్టుల ఆసీస్ సిరీస్‌లో వీరిద్దరే కీలకపాత్ర పోషించాల్సి ఉంటుంది. జట్టులో అందరికంటే సీనియర్లు వీరే. ఆస్ట్రేలియాపై మంచి రికార్డులే ఉన్న కోహ్లీకి ... ఇప్పుడున్న ఫామ్ ఇబ్బందికరంగా మారింది. అయితే, ఒక్క మంచి ఇన్నింగ్స్ ఆడితే మాత్రం చెలరేగిపోవడం ఖాయమని క్రికెట్ అభిమానులు చెబుతున్నారు. అలా జరగాలంటే క్రికెట్ దిగ్గజం సచిన్ తెందూల్కర్‌తో బ్యాటింగ్ పాఠాలు చెప్పించాలని.. అతడిని బోర్డర్ - గావస్కర్ ట్రోఫీ కోసం కన్సల్టెంట్‌గా నియమించుకోవాలని భారత మాజీ క్రికెటర్, మాజీ కోచ్ డబ్ల్యూవీ రామన్ బీసీసీఐకి సూచించాడు. ఈమేరకు సోషల్ మీడియా వేదికగా పోస్టు పెట్టాడు. ‘భారత్ జట్టుకు అత్యంత ప్రయోజనం చేకూరాలంటే నాదొక సూచన. బ్యాటింగ్ క్రికెట్ దిగ్గజం సచిన్ సేవలను వినియోగించుకోవాలి. బోర్డర్ - గావస్కర్ ట్రోఫీ కోసం బ్యాటింగ్ కన్సల్టెంట్‌గా నియమించుకోండి. తొలి టెస్టుకు రెండో మ్యాచ్‌కు చాలా సమయం ఉంది. ఈ రోజుల్లో కన్సల్టెంట్‌ల నియామకం చాలా సర్వసాధారణం. సరైందే అని భావిస్తే ఆలోచన చేయాలి’ అని బీసీసీఐని ట్యాగ్ చేస్తూ రామన్ పోస్టు చేశాడు.